సమాజం చిన్నచూపు చూసినా.. పెద్ద మనసుతో ఆదుకుంటున్నారు

మన దేశంలో ట్రాన్స్‌జెండర్లంటే ప్రతి ఒక్కరికీ చిన్నచూపు. ఇటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆదరణ నోచుకోక.. అటు సమాజంలో చీత్కరింపులు ఎదుర్కొంటూ ప్రతి రోజూ భారంగా కాలం వెల్లదీస్తుంటారు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. చాలా మంది స్వతహాగా పనులు చేసుకుంటే తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.

సమాజం తమను చిన్న చూపు చూసినా కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు హిజ్రాలు. రాయలసీమ జిల్లాల్లోని కడప, గుత్తి, గుంతకల్లు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ట్రాన్స్‌జెండర్లు సొంత ఖర్చులతో ఆహార ప్యాకెట్లను అనాథలకు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

కడప నగరంలో ప్రతి రోజూ 300 మంది నిరాశ్రయులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్లపై నివసించే వారికి మాస్కులను అందించారు. లాక్‌డౌన్‌ విధించిన రోజు నుంచి రెండు రోజులకొకసారి మాస్కులను వారే తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే సాధారణ ఆహారంతో పాటు  పౌష్టికాహారాన్ని కూడా పేదలకు ఇస్తున్నారు. బిర్యానీ, ఉడకబెట్టిన గుడ్లు, పండ్లు అందిస్తున్నారు.

పది రూపాయాలు సహాయం చేసి.. వెయ్యి రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి ప్రచారం ఆశించకుండా పేదలకు సహాయం చేస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం. సమాజం తమను పట్టించుకోకపోయినా తమలోని సామాజిక స్పృహ నిరాశ్రయులకు సేవ చేయడానికి ఉసిగొల్పుతూనే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇలాంటి వారందరికీ తగిన గుర్తింపునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show comments