Idream media
Idream media
తిరుమల కొండ ఒక్కసారిగా నిశ్శబ్దం కావడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అప్పుడప్పుడు కనిపించే చిరుతపులులు తరచూ కనిపిస్తున్నాయి. జింకలైతే ఘాట్‌రోడ్డు మీద షికార్లు చేస్తున్నాయి. వందల ఏళ్ల క్రితం తిరుమల ఆలయం చుట్టూ వన్య ప్రాణుల సంచారం అధికంగా ఉండేది. పూజలు ముగించుకుని అర్చకులు సాయంత్రానికి కొండ దిగేవాళ్లు. కొండ మీదే నివాసం ఉండే సంచార జాతులు (నక్కలోళ్లు) జంతువుల్ని తరిమేసే వాళ్లు.
కాలం మారింది. నాగరికులు తిరుమలను ఆక్రమించి , సంచార జాతుల్ని, వన్యప్రాణుల్ని కూడా తరిమేశారు.
కరోనాతో ఒక రకంగా జంతువులకి స్వేచ్ఛ లభించింది. ఊటి-కోయంబత్తూర్ ఘాట్‌రోడ్డుని జింకలు ఆక్రమించేశాయి. వాహనాల రొద లేకపోయేసరికి వాటికి ప్రశాంతత లభించింది.
ఒరిస్సాలోని రుషికుల్యా సాగర తీరంలో అద్భుతమే జరుగుతోంది. ఈ బీచ్‌లో ప్రతి ఏటా లక్షల కొద్దీ ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెడతాయి. అయితే టూరిస్టుల వల్ల వాటి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అయితే లాక్‌డౌన్ వల్ల వాటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒక్క మంగళవారమే 72,142 తాబేళ్లు ఒడ్డుకు వచ్చాయని అధికారులు లెక్కలు తేల్చారు.
సముద్రాలు శుభ్రమవుతున్నాయి. ఏళ్ల తరబడి వేల కోట్లు ఖర్చు పెట్టినా సాధ్యం కాని గంగానది ప్రక్షాళన , లాక్‌డౌన్‌తో సాధ్యమవుతోంది. ఫ్యాక్టరీల వ్యర్థాలు లేకపోయే సరికి నది శుభ్రమవుతూ ఉంది. మనుషులు లేకపోయే సరికి గంగమ్మ సంతోషంగా ఉంది.
టూరిస్ట్ ప్రాంతాల్లో చెత్త తగ్గిపోయింది. మానవ స్పర్శ నుంచి ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి హాలిడే ప్యాకేజీ ప్రకటించినట్టుంది.