Idream media
Idream media
పరిపాలన, సంక్షేమ పథకాలలోనే కాదు రాజకీయంగానూ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నడుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తప్పక విజయం సాధించాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులదే దీనికి బాధ్యతని సీఎం జగన్ అల్టిమేటం జారీ చేశారు. 90 శాతం స్థానాలు పార్టీయే గెలుచుకోవాలని, లేదంటే సంబంధిత మంత్రులకు ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జగన్ తీరును వైఎస్‌తో విశ్లేషకులు పోల్చుతున్నారు.
2009లో జరిగిన స్థానిక ఎన్నికలను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ఓడిపోతే మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ జిల్లాలలో జరిగిన జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడంతో అప్పటి మంత్రులు మూలింటి మారెప్ప, మాగంటి బాబులు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
మూలింటి మారెప్ప వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానంతో ఉండేవారు. తమకు అధిష్టానం అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన ప్రకటించారు. తన విధేయుడైనా సరే చెప్పిన మాట ప్రకారం మూలింటి మారెప్పను మంత్రి పదవి నుంచి వైఎస్ తప్పించారు. ఆ తర్వాత మాలింటి మారెప్ప ఒడిదుడుకులకు లోనై రాజకీయంగా కనుమరుగవగా.. మాగంటి బాబు మాత్రం తనకున్న సామాజికవర్గ బలంతో అవకాశాలు చేజిక్కించుకుని ఇప్పటికీ రాజకీయంగా కొనసాగుతున్నారు.
2004లో మారెప్ప కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2009లో ఆలూరు నియోజకవర్గం జనరల్ స్థానంగా మారటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మారెప్పకు ఆయనకు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లభించలేదు. తనకు కోడుమూరు కేటాయించాలని కోరినా.. అది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గానికి చెందిన మురళీ కృష్ణకు దక్కడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మారెప్పకు రాలేదు. ఆ తర్వాత ఆయన వైఎస్ తనయుడుతో కలసి నడిచారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలంగా సమర్థించారు. అయితే 2014లో ఆయనకు వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా కనుమరుగయ్యారు.
2004లో మాగంటి బాబు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి గెలిచారు. వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. మంత్రిపదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన టీడీపీలో చేరారు. దీంతో 2009లో దెందులూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తండ్రి కఠారు రామచంద్రరావుకు పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గెలిచారు. మాగంటి బాబు 2009లో టీడీపీ తరఫున ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో అదే స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నియ్యారు. 2019లోనూ ఏలూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ చేతిలో ఓడిపోయారు. అంటే పరోక్షంగా అబ్బయ్యచౌదరి రాజకీయ భవిషత్తుకు 2009 జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమే మార్గం వేసింది.
నాడు వైఎస్ తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు మంత్రులు తమ పదవులను కోల్పోయారు. ఇందులో ఒకరు రాజకీయంగా తెరమరుగవగా.. మరొకరు మాత్రం ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నారు. నాడు తండ్రి వైఎస్ బాటలోనే నేడు తనయుడు వైఎస్ జగన్ నడుస్తుండడంతో రేపు స్థానిక సంస్థల ఫలితాల తర్వాత మంత్రుల్లో ఎవరి పదవులు ఊడుతాయోనన్న చర్చ సాగుతోంది. ఒక వేల పదవులు పోతే.. ఆ తర్వాత వారి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో.. వేచి చూడాలి.
Read Also : అది చిరంజీవి చెప్పాలి నాగబాబు..!