iDreamPost
android-app
ios-app

స్థానిక పోరు ఇప్పట్లో లేనట్లే..! కారణాలు ఇవే..

స్థానిక పోరు ఇప్పట్లో లేనట్లే..! కారణాలు ఇవే..

మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు. ఓ వైపు హైకోర్టులో రిజర్వేషన్ల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. మరో వైపు విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలు ఇప్పట్లో జరిగేటట్లు కనిపించడంలేదు.

రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై కర్నూలుకు చెందిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 59.85 శాతం రిజర్వేషన్ల ప్రభుత్వం ఖరారు చేయగా.. ఈ విషయంపై సుప్రిం కోర్టు సూచనతో రాష్ట్ర హైకోర్టు వివాదం పరిష్కారంపై విచారణ జరుపుతోంది. పెరిగిన 9.85 శాతం బీసీలకు కేటాయించినవి. ఇప్పుడు 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలంటే.. బీసీలకు తగ్గించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలంటూ.. రాష్ట్ర హైకోర్టు పిటిషన్‌దారుల తరఫు న్యాయవాదిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ఆర్టికల్‌ 340 ఏం చెబుతుందో వివరించాలని కోరింది.

రిజర్వేషన్ల విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపు రాష్ట్రంలో పరీక్షల సీజన్‌ మొదలుకాబోతోంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అవి ముగిసిన వెంటనే మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఎక్కువగా విద్యా సంస్థల భవనాలనే పోలింగ్‌ కేంద్రాలుగా ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. విద్యార్థుల పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు బిజీబిజీగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్‌ అర్ధ భాగం వరకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు. వేసవి సెలవుల్లోనే స్థానిక సంస్థల పోరు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.