Idream media
Idream media
ఎన్నికలు వాయిదా అంశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోనిదంటూ సుప్రిం కోర్టు తీర్పునివ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై సుప్రింలో సానుకూల తీర్పు వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. అయితే ఎన్నికల కోడ్ ఎత్తివేయడం ఊరటనిచ్చింది.
మేలో మళ్లీ ప్రారంభం..
ఆరు వారాలు అంటే.. ఏప్రిల్ నెలాఖరు వరకూ స్థానిక సంస్థల పోరు మాటే వినపడదు. ఆ తర్వాత కరోనా ప్రభావం లేదని ఎన్నికల కమిషనర్ నిర్థారించుకుంటే ఎన్నికలకు జరుగుతాయి. అంటే మే నెల ప్రారంభంలోనే లోకల్ పోరు మళ్లీ ప్రారంభమవుతుంది. మే నెలలో గరీష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సరాసరి 47 డిగ్రీ గరీష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని గత రికార్డులు చెబుతున్నాయి. రోహిణి కార్తె మే నెలలోనే వస్తుంది. ఈ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాయనుండడంతో అభ్యర్థులు, ఓటర్లు భానుడి ప్రతాపానికి గురికాకతప్పదు.
నెల రోజుల పాటు లోకల్ పోరు..
మే నెల ప్రారంభంలో ఎన్నికల పోరు మొదలైతే దాదాపు నెల రోజులపాటు ఈ తంతు సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డు స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేష్ల ఉపసంహరణ గడువు పూర్తవగా, మున్సిపల్ వార్డు నామినేష్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ జరగాల్సింది ఉంది. మండల, జిల్లా పరిషత్ పోరుకు వారం రోజుల ప్రచార సమయం ఇచ్చిన తర్వాత పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత తుది బరిలోఎవరున్నది నిర్ణయించాలి. ఆ తర్వాత ప్రచారానికి గడువు ఇచ్చి పోలింగ్, కౌంటింగ్ జరపాలి.
ప్రారంభం నుంచి పంచాయతీ..
ఇక పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన చట్టం ప్రకారం పదిహేను రోజుల్లో పంచాయతీ పోరు ముగుస్తుంది. రెండు విడతల్లో ఈ పోరు జరగనుండడంతో రెండు పోలింగ్‌లకు మధ్య రెండు లేదా మూడు రోజుల వ్యవధి ఉండే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వాలంటే దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. మే నెల అంతా మండే ఎండలో లోకల్ పోరు సాగక తప్పని పరిస్థితి నెలకొంది.