iDreamPost
android-app
ios-app

ఎల్జీ పాలిమర్స్ లో బాబు కమిటీ లక్ష్యాలు వేరు..

  • Published May 09, 2020 | 6:57 PM Updated Updated May 09, 2020 | 6:57 PM
ఎల్జీ పాలిమర్స్ లో బాబు కమిటీ లక్ష్యాలు వేరు..

అత్యున్నత విద్యావంతులైన అధికారులకు ఏమీ తెలియదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని బాగా తగ్గించాయని టీడీపీ నేతలు కూడా వాపోతున్నారు. అనుభవం ఉన్న అధికారుల కమిటీని ఎద్దేవా చేసేందుకు బాబు చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యిందని తలలు పట్టుకుంటున్నారు. రానురాను టీడీపీ నేత తీరు తిరోగమనంలో సాగుతుండడం సహించలేకపోతున్నారు. ఇప్పటికే చినబాబు తీరు వల్ల పార్టీ పరువు పోతే ఇప్పుడు చంద్రబాబు కూడా ఆయన స్థాయికి చేరడం అంతుబట్టడం లేదని సీనియర్లు సతమతం అవుతున్నారు.

అధికారులకు రసాయనాల గురించి తెలియదంటూ చంద్రబాబు తన పార్టీ నేతలతో వేసిన కమిటీ వెనుక అసలు లక్ష్యం ఏమిటనే విషయంపై పలువురు టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కమిటీలో విశాఖకు చెందిన టీడీపీ నేతలు, చివరకు మాజీ మంత్రులను కూడా ఎందుకు పక్కన పెట్టారనేది వారికి అంతుబట్టడం లేదు. వాస్తవానికి విశాఖలో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలవగా అందులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం మౌనంగా ఉన్నప్పటికీ మిగిలిన ముగ్గురు ఈ ఘటన పట్ల వేగంగా స్పందించారు. అందులో సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చురుగ్గా కదిలారు. గతంలో ఆయన పెందుర్తి నుంచి కూడా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తాజా ఘటన విషయంలో ఆయన ప్రజలకు అండగా ఉండేందుకు ప్రయత్నించారు. చివరకు సీఎం సమీక్షలో కూడా పాల్గొని ప్రభుత్వానికి సూచనలు చేశారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించడం పట్ల గణబాబు హర్షం వ్యక్తం చేశారు.

అదే చంద్రబాబుకి రుచించడం లేదా అన్నది విశాఖ టీడీపీ నేతల వాదన. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు గణబాబుని కాదని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అతని కన్నా జూనియర్ ఎమ్మెల్యేని కమిటీలో ఎలా వేస్తారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలిసిన నేతలకు కమిటీలో చోటు లేకుండా చేసిన చంద్రబాబు అసలు లక్ష్యం వేరని అనుమానిస్తున్నారు. ప్రజల సమస్యల కోసమే అయితే ప్రజల్లో ఉన్న నేతలతో కమిటీ వేయాలని, చివరకు నగర అద్యక్షుడిగా ఉన్న వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ని కూడా కాదని దూర ప్రాంతానికి చెందిన నాయకులను కమిటీలో వేయడం ద్వారా చంద్రబాబు ఏం ఆశిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిస్థితులు విశాఖ టీడీపీలో పెద్ద చర్చకు దోహదం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఉండగా అచ్చెన్నాయుడు సారధ్యంలో కమిటీ ఎందుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది విశాఖ నేతల పట్ల చంద్రబాబు చిన్నచూపునకు నిదర్శనమా లేక ఇతర ప్రయోజనాలు ఏమయినా ఆశించి ఈ కమిటీ రూపొందించారా అన్నదే వారికి అంతుబట్టడం లేదు. ఏమయినా చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ బలోపేతానికి, తద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదం చేయాలనే ఉద్దేశంతో కన్నా ఇతర అంశాల చుట్టూ ఉన్నాయనే అనుమానాలకు ఈ ప్రశ్నలు దోహదం చేస్తున్నాయి.