Idream media
Idream media
షెర్లాక్‌హోమ్స్ ప్రత్యేకత ఏమంటే ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడు. ఇంకా చెప్పాలంటే పేగులు తీసి మెళ్లో వేసుకుంటాడు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ కూడా షెర్లాక్‌హోమ్స్‌కి తగ్గడని గతంలో కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. జగన్ కేసులో ఆయన ఇచ్చిన లీకుల్ని ఆనందంగా కళ్లకద్దుకుని , కొత్త రంగులు అద్ది ప్రజలకి తెలియజేసిన వాళ్లు ఉన్నారు.
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఆయన పోయి పోయి జనసేనలో పడ్డాడు. పడితే పడ్డాడు, పవన్‌కల్యాణ్ ప్రజాసేవ చేస్తాడని నమ్మాడట. నమ్మితే నమ్మాడు, ఇప్పుడు పవన్ మాట నిలకడలేని వాడని అంటున్నాడు. అంటే అన్నాడు , ఈ పార్టీలో ఉండనని రాజీనామా చేసి పడేశాడు.
సీబీఐలో చాలా తెలివైన వాళ్లు ఉంటారనే భ్రమ ఉండేది నాకు. వాళ్లు అద్భుతమైన ప్రతిభతో ,నేర పరిశోధనా శక్తితో ఈ దేశాన్ని కాపాడుతున్నారనే భ్రాంతి కూడా ఉండేది. పవన్‌కల్యాణ్ ప్రజాసేవ చేస్తాడంటే మా ఊర్లో కానిస్టేబుల్ కూడా నమ్మడు. అంత పెద్ద సీబీఐకి బాస్‌గా ఉండి నువ్వెట్లా నమ్మావ్ లక్ష్మీనారాయణా?
తమరికి నిజంగా సునిశితమైన , చురుకైన గ్రాహణ శక్తి ఉంటే వైజాగ్‌లో పోటీ చేయనే చేయరు. ఎందుకంటే జగదాంబ సెక్షన్‌లో టీ మేస్టార్‌కి కూడా తెలుసు మీరు ఓడిపోతారని. మీరు ఏ నమ్మకంతో నిలిచారో తెలియదు.
అసలు పవన్‌కల్యాణ్ గ్రాఫ్ పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అతనికి నిలకడ లేదని. ఎప్పుడు ఎవరిని నిలదీస్తానంటాడో , ఎవరితాట వలుస్తానంటాడో తెలియదు. పార్టీ పెట్టిన వాడు, జిల్లాల్లో, మండలాల్లో పార్టీని విస్తరిస్తాడు తప్ప, మీటింగ్‌ల్లో ఊగిపోతూ అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటాడా? చప్పట్లతో ఓట్లు పడుతాయా!
ఏమో గుర్రం ఎగరా వచ్చు అని మీరు నిలబడ్డారు, ఆయన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టారు. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఏ లక్షణమైనా జనసేనకు ఉందా!
ఢిల్లీలో అంతమంది రాజకీయ నాయకుల్ని చూశారు కదా! నాయకుడు ఎలా ఉంటాడో మీకు తెలియదా? అయినా పవన్ సినిమాల్లో మళ్లీ యాక్ట్ చేయడని అనుకున్నారంటే , మీరసలు బీట్ కానిస్టేబుల్‌కి కూడా దీటుగా లేరు. అంత పెద్ద పోస్టులో ఇంత కాలం ఎట్లా ఉన్నారని అందరికీ ఆశ్చర్యం.
జగన్ కేసులో మీరు చూపిన అతి ఉత్సాహం అంతా విధి నిర్వహణ కాదని, కేవలం అదంతా ఎవరో ఆడిస్తే ఆడిన తోలుబొమ్మలాటని సామాన్యులు అనుకుంటే తప్పు ఏమైనా ఉందా?
ఎన్నికల్లో గెలవలేదు. ఆయన సినిమాలను ఎంచుకున్నారు. పార్టీ నుంచి బయటకు పోవడానికి మీకో సాకు కావాలి. అది సినిమా రూపంలో దొరికింది.
మీరంతా ప్రజాసేవ నుంచి దూరంగా వెళ్లడమే నిజమైన ప్రజాసేవ.