Lakshmi Narasimha : పోలీస్ నరసింహగా బాలయ్య విశ్వరూపం – Nostalgia

1999 ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సమరసింహారెడ్డి ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో అన్నే చిక్కులను బాలకృష్ణకు తెచ్చి పెట్టింది. తర్వాత చేసే ప్రతి సినిమాను దాని స్థాయి అంచనాలతో మ్యాచ్ చేయలేక దర్శకులు ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ క్రమంలోనే సుల్తాన్, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, గొప్పింటి అల్లుడు లాంటివి ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. తిరిగి బి గోపాలే మళ్ళీ నరసింహనాయుడు రూపంలో అదే ముఠాకక్షల నేపధ్యంతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. దాని తర్వాత కథ మళ్ళీ మొదటికే. భలేవాడివి బాసూ, సీమసింహం, పలనాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ ముద్ర వేసుకోగా చెన్నకేశవరెడ్డి కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది

ఆ సమయంలో ఏదైనా కంప్లీట్ మేకోవర్ ఉండే కథ కోసం వెతుకుతున్న బాలయ్య వద్దకు ఓ రీమేక్ ప్రతిపాదన వచ్చింది. 2003 తమిళంలో విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సామీ పెద్ద హిట్టు. పోలీస్ ఆఫీసర్ పాత్రను ఊర మాస్ గా చూపించిన విధానానికి జనం జేజేలు కొట్టారు. దీని ద్వారానే కోట శ్రీనివాసరావు కోలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీన్ని తెలుగులో తీసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. రౌడీ ఇన్స్ పెక్టర్ తర్వాత అంత పవర్ ఫుల్ షేడ్స్ ఇందులో ఉన్నాయన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయ్యింది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో హిట్స్ ఇచ్చి ప్రభాస్ ని పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాంజీ తొలుత ఈ రీమేక్ కు సంశయించినా ఫైనల్ గా ఒప్పుకున్నారు.

పరుచూరి బ్రదర్స్ రచన చేయగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. పెద్దగా మార్పులు లేకుండా ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయ్యారు. టెంపర్, పటాస్ లాంటి సినిమాలకు ఈ క్యారెక్టరే స్ఫూర్తి. కోట బదులు ఇక్కడ విలన్ గా ప్రకాష్ రాజ్ చేశారు. ఆసిన్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. అక్కడ ఈ పాత్ర త్రిష చేసింది. లంచాలకు రుచి మరిగిన ఒక పోలీస్ ఆఫీసర్ స్థానిక రౌడీ లీడర్ తో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకుంటాడు. దాని వెనుక ఉన్న బలమైన కారణాలు, ఎలా మారాడు ఏం చేశాడు అనేదే మెయిన్ పాయింట్. 2004 జనవరి 14న విడుదలైన లక్ష్మి నరసింహ మంచి విజయం సాధించింది. అదే రోజు రిలీజైన వర్షం ఎఫెక్ట్ దీని మీద గట్టిగా పడిందన్నది వాస్తవం. అయినా కూడా బాలయ్య మూవీ వంద రోజులు ఆడింది. 15న వచ్చిన చిరంజీవి అంజి వీటి మధ్య ఫ్లాప్ గా నిలిచింది

Also Read : Priyamaina Neeku : తరుణ్ కి బ్రేక్ ఇచ్చిన లవ్ స్టోరీ – Nostalgia

Show comments