iDreamPost
android-app
ios-app

బీజేపీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆదిపురుష్ కి రాజకీయ రంగు..

బీజేపీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆదిపురుష్ కి రాజకీయ రంగు..

కొద్దిరోజులుగా బీజేపీ నేతలు.. హిందుత్వ, జాతీయవాద సినిమాలను ప్రోత్సహిస్తూ తమకు తాము బ్రాండ్లుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని బీజేపీ ఓన్ చేసుకొని ఎంతగా ప్రచారం చేసుకుందో చూశాం.. ఇప్పుడు ‘శ్రీరాముడి’ని బేస్ చేసుకొని తీస్తున్న ‘ఆదిపురుష్’ మూవీని కూడా బీజేపీ అలానే వాడుకుంటోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు.

సాధారణంగా హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. కనీసం మాట్లాడడానికి కూడా తటపటాయిస్తాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఆదిపురుష్’ మూవీకి రాజకీయ రంగు అంటుకోవడం వైరల్ గా మారింది. తాజాగా ఆదిపురుష్ సినిమా మీద టీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్లాన్ లో భాగంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వచ్చే ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ఆలయాన్ని పున:నిర్మిస్తామని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక అయోధ్య నిర్మించాక ‘ఆదిపురుష్ ‘ ను విడుదల చేయాలని ప్లాన్ గా ఉందని సమాచారం. తద్వారా ఈ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చి ఎన్నికల ముందర విడుదల చేస్తారని కేటీఆర్ ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టాక్స్ తగ్గించి ప్రమోషన్స్ చేసి మరీ సినిమాలు ఎలా హిట్ చేశారో ఆదిపురుష్ విషయంలో కూడా అదే చేస్తారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే బీజేపీ తన ప్రభుత్వ హయాంలో చేసిన సర్జికల్ స్ట్రైక్ పై సినిమాను తీయించి బాగా ప్రచారం చేసుకుందని టాక్ నడిచింది. గతంలో ‘యూరీ’ అనే సినిమాను సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తీయించి అందరికీ ఉచితంగా చూపించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇటీవల కశ్మీర్ ఫైల్స్ ను అలాగే హిట్ చేశారు. ఇక బీజేపీ పథకాలను ప్రమోట్ చేసేందుకు అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఇక ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు బీజేపీలో ఉండడంతో ప్రభాస్ ఈ సినిమా చేస్తూ ఉండొచ్చని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఆరోపణలపై తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు స్పందిస్తున్నారు. ఆదిపురుష్ బీజేపీ ఎజెండాలో భాగమని జరుగుతున్న ప్రచారాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ప్రభాస్ బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ లాంటి ఎన్ని సినిమాలు చేస్తున్నారని, రాజకీయాల కోసం ‘ఆదిపురుష్’ను వాడుకోవద్దని హితవు పలికారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కోరగానే 1650 ఎకరాలను దత్తత తీసుకొని హరితహారంలో అడవిగా మారుస్తున్న ప్రభాస్.. అలా అయితే టీఆర్ఎస్ ఎజెండా కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎన్నో దేశ భక్తి సినిమాలు వస్తున్నాయని.. అవన్నీ బీజేపీ తీస్తున్నవా? అని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రామాయణం అంటే బీజేపీకి చెందిందా? అలా అయితే పేరులోనే తారాక ‘రామా’ రావు అని పెట్టుకున్న కేటీఆర్ కూడా బీజేపీకి చెందిన వ్యక్తియే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంతటితో ముగుస్తుందా..?కొనసాగుతుందా..? చూడాలి.