Idream media
Idream media
కొండపొలం ఒక రచయిత కల, దర్శకుడి ఆకాంక్ష., కళాకారుల ప్రతిభ. రొటీన్ సినిమా కొలతల్లో ఇది ఇమడదు. క్రిష్ కొంచెం ప్రయత్నించాడు (హీరోయిన్ లవ్ ట్రాక్, డ్రీమ్ సాంగ్). అయినా కథ లొంగలేదు.
చిన్నప్పుడు గోపాల్ అనే ఫ్రెండ్. సినిమాలో హీరోలా మేం గొల్లోళ్లం అని గర్వంగా చెప్పేవాడు. కొండల్లోకి గొర్రెలు తీసుకెళ్లేవాళ్లు. కత్తె గొరక (హైనా కన్నడంలో) వెంటపడితే ఎలా తప్పించుకున్నారో చెప్పేవాడు. భయంగా వినేవాన్ని. అది చిన్నపిల్లలా నవ్వుతుందని, వీపున కొమ్ము వుంటుందని, మేక పిల్లల్ని కొమ్ముకి తగిలించుకుని పారిపోతుందని చెప్పేవాడు. వాడు అసలు హైనాని చూడలేదని నాకు తెలీదు.
మాటల కాలుష్యం, శబ్ద కాలుష్యం , వాతావరణ కాలుష్యం అన్నీ మరిచిపోయి రెండు గంటలు అడవిలో తిరగాలనుకుంటే కొండపొలం సినిమా చూడండి. గొర్రెల కాపరుల ప్రపంచంలో తిరగండి. ట్విస్ట్‌లు, క్లైమాక్స్, హీరోయిజం ఇవన్నీ ఆశించకండి. బతుకు కోసం పోరాటం. ప్రకృతితో , క్రూరమృగాలతో , అంతకు మించిన మనుషులతో.
గొర్రెల కాపరుల్ని ఎపుడైనా పలకరించారా? పలకరిస్తే చద్దిమూటతో పాటు, కథల మూట కూడా విప్పుతాడు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో కనిపించేవాళ్లు. మందలో వున్న వందల గొర్రెల్లో ఎవరి గొర్రెలు వాళ్లు ఎలా గుర్తు పడతారని అడిగాను. మనుషుల్ని గుర్తు పట్టినట్టే అన్నాడు. చూడడానికి అన్నీ ఒకేలా వున్నా, తోకలు, చెవులు, నుదుటి మీద గుర్తులు వేరే వుంటాయని అన్నాడు. నేర్చుకుంటే ప్రతిదీ శాస్త్రమే.
హైదరాబాద్ మణికొండలో కూడా గొర్రెల కాపరులు కనిపించారు. శాస్త్రం తెలియని వాళ్లు. గొర్రెలకి ఒక చార పెయింట్ వేశారు. గుర్తు కోసం అన్నారు. గుర్తు పట్టలేవా అని అడిగితే మా నాయనకి వస్తది అన్నాడు. జేబులో సెల్‌ఫోన్ వస్తే దేన్ని గుర్తు పెట్టుకునే పనిలేదు.
నాగరికం తెలియని నల్లమల కాపరుల వెంట రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నడిచాడు. విన్నాడు, తెలుసుకున్నాడు. కొండపొలం పుస్తకంగా మారింది. రచయితకి చాలా స్వేచ్ఛ. పాఠకుడికి సొంత దృశ్యం వుంటుంది. ప్రేక్షకుడికి వుండదు. వాన వచ్చింది అని ఒక వాక్యం రాస్తే చాలు. కానీ దాన్ని తీయాలంటే దర్శకుడికి చాలా సామాగ్రి కావాలి. సినిమా మీద ప్రేమతో క్రిష్ ఆ రిస్క్ తీసుకున్నాడు. మొదటి పది నిమిషాలకే అడవికి తీసుకెళతాడు. చివరి వరకూ అక్కడే వుంచుతాడు.
చిన్నప్పటి నుంచి వింటూనే వున్నా, థియేటర్‌లో కడప యాస వస్చాన్నాడు, చూస్చాన్నాడు వింటూ వుంటే ఆనందం. అడవి మనతో మాట్లాడుతున్నట్టు. అడవి బిడ్డలతో తిరుగుతున్నట్టు.
వైష్ణవ్‌తేజ్ గొల్లబిడ్డగా ఒదిగిపోయాడు. చిరంజీవి ట్యాగ్‌లైన్ లేకుండా ఎదిగే సత్తా వున్నవాడు. ఓబులమ్మగా రకుల్ పర్‌ఫెక్ట్. అందరికంటే గొప్ప నటన సాయిచంద్‌ది. సగం మందని అమ్మి చదివించిన కొడుకుకి ఉద్యోగం రాలేదు. చివరికి తనతో పాటు గొర్రెలు తోలుకుంటూ అడవికి వచ్చాడు. కొడుకుపై చూపే ఎమోషన్స్ అద్భుతం. అతను నటుడు కాదు, తండ్రి, పేద గొర్రెల కాపరిగానే కనిపిస్తాడు.
నిజానికి ప్రపంచమే ఒక అడవి. నాగరిక అరణ్యంలో వచ్చే ప్రమాదాలు తక్కువేం కాదు. కానీ అడవిని జయించిన వాడికి అవో లెక్కకాదు. పొట్టేలులా ఢీకొడతాడు. సినిమా సారాంశం అదే.
సన్నపురెడ్డి మాటలు తాత్విక లోతులతో ఆలోచనలో పడేస్తాయి. ఎవరో రాసిన మాటల్ని, తమవిగా చెలామణి చేసుకునే ఇండస్ట్రీలో క్రిష్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ క్రెడిట్ సన్నపురెడ్డికే ఇచ్చాడు. తెలుగు సినిమాకి కొత్త కథలు, మంచి రోజులు వస్తున్నాయి.
వాట్సాప్, ఫేస్‌బుక్, తుక్కు రాజకీయ చర్చలు, గాసిప్స్ , ఇన్సెస్ట్‌మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ట్రెక్కింగ్‌కి వచ్చినట్టు థియేటర్‌కి రండి. ఫిర్యాదులులేకుండా చూడండి. సంచారజీవుల ఆత్మని గుండెల్లో పెట్టుకుని తిరిగి వెళ్లండి. వాళ్లెవరో కాదు. మన పూర్వీకుల ఆనవాళ్లు. ప్రకృతిని ధ్వంసం చేయకుండా వినయంగా చేతులు కట్టుకుని అర్థించేవాళ్లు. నిజానికి వాళ్ల కోసమే వానలు కురుస్తున్నాయి.
Also Read : కొండపొలం రివ్యూ