కొండపొలం రివ్యూ

By Ravindra Siraj Oct. 08, 2021, 02:31 pm IST
కొండపొలం రివ్యూ

ఈ ఏడాది ప్రారంభంలో ఉప్పెన లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కొండపొలం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంచె, గమ్యం, వేదం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తున్న క్రిష్ దర్శకుడు కావడంతో దీని మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ట్రైలర్ లోని విజువల్స్, కాన్సెప్ట్ పరంగా కనిపిస్తున్న వైవిధ్యం బాగానే ఆకట్టుకున్నాయి. అన్నయ్య సాయి తేజ్ రిపబ్లిక్ వచ్చిన వారానికే తమ్ముడు వైష్ణవ్ తేజ్ పలకరిస్తున్నాడు. మరి కొండపొలం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

కడప జిల్లా మారుమూల అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరి(సాయి చంద్)కొడుకు రవీంద్రనాథ్(వైష్ణవ్ తేజ్). ఇంజనీరింగ్ చదివి నాలుగేళ్లు హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరైన నైపుణ్యాలు లేని కారణంగా ఫెయిలవుతూ ఉంటాడు. తిరిగి గ్రామానికి వచ్చాక తాత ఇచ్చిన ధైర్యంతో తండ్రితో కలిసి గొర్రెలను మేపేందుకు తమ కుటుంబ ఆధారమైన కొండపొలానికి బయలుదేరతాడు. ప్రమాదకరమైన పులితో పాటు అడవి సంపద మీద కన్నేసిన కొందరు దుర్మార్గుల నుంచి తన గుంపుని కాపాడుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలోనే బృందంలో చలాకీగా ఉండే ఓబులమ్మ(రకుల్ ప్రీత్ సింగ్)ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి

నటీనటులు

ఇప్పుడిప్పుడే నటనలో ఓనమాలు దిద్దుతున్న వైష్ణవ్ తేజ్ ని ముందుగా మెచ్చుకోవాల్సింది కథల ఎంపిక విషయంలో. రిస్క్ ఎక్కువగా అనిపించే సబ్జెక్టులను ఎంచుకుంటూ తనలో యాక్టర్ కి గట్టి ఛాలెంజులే విసురుతున్నాడు. పెర్ఫార్మన్స్ పరంగా కొండపొలం ఒక మంచి ఎక్స్ పీరియన్స్. కాకపోతే ఎమోషన్స్ విషయంలో తను చేయాల్సిన హోమ్ వర్క్ మాత్రం చాలా ఉంది. ఫేస్ లో సీరియస్ టోన్ ని ఎక్కువగా చూపించడం ద్వారా అసలైన ఎమోషన్ పూర్తి స్థాయిలో బయటికి రావడం లేదు. ఇది మైనస్ అని చెప్పడం కాదు కానీ దృష్టి పెట్టాల్సిన అంశమే. మొత్తానికి ఒక మెట్టు ఎక్కడానికి ఈ సినిమా ఉపయోగపడింది

ఓబులమ్మగా రకుల్ ప్రీత్ సింగ్ పర్ఫెక్ట్ ఫిట్. సీమ ప్రాంతంలో సహజమైన పల్లె పడుచులు ఇంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు కానీ కమర్షియల్ యాంగిల్ లో చేసుకున్న సెలక్షన్ కాబట్టి ఆ కోణంలో చూడకపోతే రకుల్ చెప్పుకున్నట్టు తన కెరీర్ లో ఇది చెప్పుకోదగ్గ రోల్. ఈ మధ్య కాలంలో లేట్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న సాయి చంద్ కు మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది. ఎప్పటిలాగే చెలరేగిపోయారు. నాజర్, కోట శ్రీనివాసరావు, హేమ, రవిప్రకాష్ తదితరులవి ప్రత్యేకంగా లెన్త్ ఎక్కువ ఉన్న రోల్స్ కాకపోయినా సీనియర్లు కావడం వల్ల నిండుదనం వచ్చింది. ఇతర చిన్నా చితకా ఆర్టిస్టులు అందరూ సహజంగా ఉన్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

ఒకప్పుడు తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన నవలల ట్రెండ్ చాలా ఏళ్ళ క్రితమే తగ్గిపోయింది. అప్పట్లో వీటి ఆధారంగా సినిమాలు చేసి ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు బ్లాక్ బస్టర్లు సాధించారు. సెక్రటరీ, అభిలాష లాంటివి గొప్ప ఉదాహరణలు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెండితెరపై ఒక నవల అందులోనూ ఒక మంచి కలయికలో రూపుదిద్దుకోవడం కథల కొరతతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ కు ఒక మార్గనిర్దేశనం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న కొండపొలం లాంటి సబ్జెక్టుని ఎంచుకున్నందుకు ముందుగా క్రిష్ ని అభినందించాలి. అది కూడా ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు

ఒక పుస్తకాన్ని చదవడం వేరు. దాన్ని కమర్షియల్ మోడ్ లో స్క్రీన్ ప్లేగా మార్చుకుని ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మెప్పించేలా సినిమా తీయడం వేరు.దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాలన్స్ చేయడం కత్తిసాము లాంటిది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలలో నిజాయితీ ఉంటుంది. సగటు అడవిమనిషి ఆవేదన, కడుపున పుట్టిన పిల్లలతో సమానంగా గొర్రెలను చూసుకునే కాపరుల ప్రేమాభిమానం, పులిని సైతం గౌరవించే ఔన్నత్యం ఇవన్నీ కలగలసి ఉంటాయి. క్రిష్ వీటిలో ఏదీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో కొండపొలంని తెరకెక్కించే క్రమంలో మాస్, కమర్షియల్ లాంటి పదాల జోలికి పోలేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశమే క్రిష్ మీద గౌరవాన్ని పెంచింది. ఎంత ఏసి హాలులో డాల్బీ సౌండ్ తో సినిమా చూస్తున్నా సరే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ మనమూ నల్లమల అడవుల్లో తిరుగుతున్నామన్నంత సహజంగా ప్రతి ఫ్రేమ్ గొప్పగా అనిపిస్తుంది. సహజమైన సీమ యాసలో సంభాషణ, ప్రాసల కోసం పాకులాడకుండా అనవసరమైన అంశాలను ఇరికించకుండా చేసిన ప్రయత్నమూ బాగుంది. వేషధారణ, స్థానికత, ప్రజల స్థితిగతుల మీద చెప్పుకోదగ్గ రీసెర్చ్ చేసిన వైనం స్పష్టమవుతుంది. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా మొదటి అరగంటలోనే అసలు కథలోకి ప్రవేశించడం ఇవన్నీ ఓకే.

రియలిస్టిక్ సినిమా వైపు టాలీవుడ్ అడుగులు వేయడం శుభపరిణామం. కొంత తడబాటు ఉండొచ్చు. కమర్షియల్ బిల్ లో ఫిట్ కాక వసూళ్లు భారీగా రాకపోవచ్చు. కానీ కనీస స్థాయి ప్రోత్సాహం ఇవ్వగలిగితే రాబోయే రోజుల్లో మరికొందరు దర్శకులు పుస్తకాలు చదివే ఓపిక టైం లేని ఇప్పటి తరానికి కొండపొలం లాంటి మరిన్ని కథలు తెరకు పరిచయం చేస్తారు. కాకపోతే ఎంత గొప్ప నవల అయినా థియేటర్లో చూపిస్తున్నాం కాబట్టి సినిమాటిక్ టచ్ అవసరం. అందులోనూ తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యం. దానర్థం రెండు మూడు పాటలు అదనంగా పెట్టడం కాదు. వాళ్ళు థ్రిల్ అయ్యే అంశాలను సరైన మోతాదులో బ్యాలన్స్ చేయడం. ఇందులో అది సగమే నెరవేరింది

ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూద్దాం. అడవికి వెళ్లిన ఒక కాపరి బృందం, అక్కడో పులి, గొర్రెలను దుంగలను దోచుకునే దొంగలు ఇలా సెటప్ అంతా ఆసక్తి రేపేలా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో దానికి సరిపడా టెంపో పూర్తి స్థాయిలో లేకపోవడం స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తుంది. రవి ఓబుల మధ్య ఉంచిన పాటలు నిడివిని పెంచడానికి తప్ప అంతగా ఉపయోగపడలేదు. ప్రేక్షకుల దృష్టి అడవి అందులో జరిగే పరిణామాల మీదే ఉన్నప్పుడు వీళ్ళ ప్రేమకథను అవసరానికి మించి సాగదీస్తే ఎలా ఆస్వాదిస్తారు. ఈ ఒక్క లోపాన్ని మినహాయిస్తే కొండపొలం నిస్సందేహంగా మంచి ప్రయత్నమే.

చాలా కాలం తర్వాత ఎంఎం కీరవాణి మేజిక్ పూర్తి స్థాయిలో వినిపించింది. పాటలు మరీ చార్ట్ బస్టర్ అనిపించకపోయినా విజువల్ గా చూస్తున్నంత సేపూ మంచి ఫీల్ కలిగించాయి. బ్యాక్ గ్రౌండ్ తో స్కోర్ తో సీన్స్ ని ఎలివేట్ చేయడంలో మరోసారి ఆయన మార్కు కనిపిస్తుంది. వి ఎస్ జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్ లో సాగింది. ఇంత తక్కువ టైంలో అంత రిచ్ అవుట్ ఫుట్ వచ్చేలా క్రిష్ విజన్ ని స్క్రీన్ మీద చూపించడంలో ఆయన వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రవణ్ ఎడిటింగ్ ఇంకొంత షార్ప్ గా ఉంటే బెటర్ అనిపించింది. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ వర్క్ మాత్రం అన్ని ప్రశంసలకు అర్హత దక్కించుకుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి

ప్లస్ గా అనిపించేవి

కాన్సెప్ట్
కీరవాణి బిజిఎం
ఛాయాగ్రహణం
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్ ల్యాగ్
వైష్ణవ్ రకుల్ మధ్య ట్రాక్
రెండో సగంలో పాటలు
హడావిడి క్లైమాక్స్

కంక్లూజన్

సహజత్వం వైపు పరుగులు పెడుతున్న తెలుగు సినిమాకు గత కొన్నేళ్లలో మంచి అడుగులు పడుతున్నాయి. వాటికి విపరీతమైన ఆదరణ దక్కవచ్చు లేకపోవచ్చు కానీ ఒక వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్న కొండపొలం లాంటి ప్రయత్నాలు కమర్షియల్ సినిమాతో సమాంతరంగా ప్రయాణం చేయడం చాలా అవసరం. 4జి టెక్నాలజీలో స్మార్ట్ ఫోనే ప్రపంచంగా బ్రతుకుతున్న జెనరేషన్ కు అడవి మట్టి వాసన ఎలా ఉంటుందో తెలియజెప్పే ఇలాంటి చిత్రాలు రావాలి. దానికి సరైన క్యాస్టింగ్, క్వాలిటీ టెక్నికల్ టీమ్ దొరకాలి. కొండపొలంకి ఇవన్నీ కుదిరాయి. అంచనాల కొలమానాలు పక్కనపెట్టే పనైతే ఓసారి సినిమా చూసేందుకు ఆలోచించనక్కర్లేదు

ఒక్కమాటలో - అడవి చెప్పే ఆత్మకథ

 Also Read : రిపబ్లిక్ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp