iDreamPost
iDreamPost
ఎప్పటిలాగే టాలీవుడ్ సంక్రాంతి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. కేవలం ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనే క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఏడాది మొత్తంలో భారీ రెవిన్యూ వచ్చే సీజన్ ఇదే కావడంతో నిర్మాతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మొదటి బోణీ రజనికాంత్ డబ్బింగ్ సినిమా దర్బార్ చేయనుంది. ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు రోజుల గ్యాప్ తో రాబోతున్నాయి.దర్బార్ సంగతి పక్కనబెడితే అత్యధిక శాతం థియేటర్లు ఈ ఇద్దరి హీరోల పంపకాలకే సరిపోతాయి.
ఆ తర్వాత 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురాతో పలకరించబోతున్నాడు. ఫ్యామిలీ సినిమాలను డీల్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న సతీష్ వేగ్నేశ దర్శకుడు కావడంతో ఆ వర్గంలో దీని మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇతని గత చిత్రం శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచింది. ఇప్పుడు మహేష్, బన్నీలతో తలపడేంత కంటెంట్ ఎంత మంచివాడవురాలో ఉందా అనే ప్రశ్నే ఆసక్తికరంగా మారింది.
2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల సమయంలో సతీష్ వేగ్నేశ తన శతమానం భవతితో హిట్టు కొట్టడమే కాక జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టాడు. ఇప్పుడు అంతకు మించిన పోటీ కనిపిస్తోంది. అయినా కూడా అదే తరహాలో సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో మంచివాడిని బరిలో దింపుతున్నారు . ఇది గుజరాతి బ్లాక్ బస్టర్ ఆక్సిజన్ రీమేక్ గా టాక్ ఉంది. ఇది అధికారికంగా నిర్ధారించలేదు కాని చాలా మార్పులు చేశారని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం ఎల్లుండి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఎంత మంచివాడవురాలో బలమైన కంటెంట్ ఉంటె తప్ప గెలవడం కష్టం.