ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.. క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతి..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బడ్జెట్‌పై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కాలానికి సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధకానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నాని తెలిపారు. 10 లక్షల సర్జికల్‌ మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. 400 వెంటిలేటర్లు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వైద్య సిబ్బందికి ప్రత్యేకమైన దస్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజవర్గంలో వంద పడకలు, జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్‌ వార్డులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయా రాష్ట్రాల సీఎంలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో వందల సంఖ్యలో చాలా మంది ఉన్నారని, వారందరూ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధమైతే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.

Show comments