Idream media
Idream media
దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రతి పార్టీ ఏదో ఒక వైపు తమ స్టాండ్‌ను తీసుకుంది. ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ కూడా ముస్లింలకు నష్టం చేకూర్చే విధానాలకు మద్దతు తెలపబోమని స్పష్టం చేసింది. సీఎం వైఎస్ జగన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే టీడీపీ మాత్రం అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. బీజేపీకి దగ్గరయ్యే పనిలో ఉన్న చంద్రబాబు.. ఇంతవరకు ఆ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. అక్కడక్కడా స్థానిక నేతలు అడపాదడపా నిరసనల్లో పాల్గొంటున్నారు.
అయితే టీడీపీలో ఓ వ్యక్తి మాత్రం పార్టీతో సంబంధం లేకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించకపోతే టీడీపీకి సైతం రాజీనామా చేస్తానంటూ హల్‌చల్ చేస్తున్నారు. ఆయనే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాజ్ కేశినేని నాని. ఎప్పుడూ విజయవాడ దాటి వెళ్లి రాజకీయాలు చేయని ఆయన.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ర్యాలీలు జరిగినా వెళ్తున్నారు. అది కూడా పార్టీకి సంబంధం లేకుండా. ఇదంతా కేశినేని నాని ఎందుకు చేస్తున్నారా? అని ఆరా తీస్తే ఆయన సన్నిహితులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. రాజకీయంగా పరపతి పెంచుకునే పనిలో భాగంగానే.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ఆందోళనలను ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. టీడీపీలో తనను ఎదగకుండా చేసిన వారికి బుద్ధి చెప్పేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని పేర్కొంటున్నారు.
కేశినేని ట్రావెల్స్ అధినేతగా, వ్యాపారవేత్తగా కేశినేని నాని అందరికీ సుపరిచితమే. చిరంజీవి ప్రజారాజ్యం ప్రారంభించిన కొత్తలో భారీ హంగామాతో పార్టీలో చేరిన ఆయన.. మూడు నెలల్లోనే బయటికొచ్చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో విజయవాడ ఎంపీ టికెట్ సాధించి గెలిచారు. అయితే అప్పటి నుంచే ఆయనకు అసలు సినిమా మొదలయ్యింది. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో విభేదాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో తనను దాటి దేవినేని ఉమా ఎవరినీ ఎదగనివ్వరు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ క్రమంలోనే కేశినేనిని తక్కువ చేస్తూ వచ్చారు దేవినేని. అభివృద్ధి పనుల విషయంలోనూ చంద్రబాబు దేవినేనికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ దేవినేనిదే హవా నడిచేది. ఇది ఏ మాత్రం కేశినేనికి నచ్చేది కాదు. అయితే అధికార పార్టీలో ఉండడం తనకు అవసరం కాబట్టి ఏమీ మాట్లాడలేదు.
2019 ఎన్నికలకు వచ్చే సరికి తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కృష్ణా జిల్లాలోనూ రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగతా 14 చోట్లా టీడీపీ ఓడిపోయింది. విజయవాడ పార్లమెంట్ స్థానం మాత్రం చేజిక్కించుకుంది. మరోవైపు లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ను, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడిని చంద్రబాబు నియమించారు. అంతగా ప్రాధాన్యం లేని విప్ పదవిని కేశినేని నానికి కేటాయించారు. దీంతో ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని కేశినేని వెళ్లగక్కారు. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాంటూ సూచించడం పార్టీలో కలకలం రేపింది. అప్పట్లోనే టీడీపీకి గుడ్‌బై చెబుతారని అందరూ అనుకున్నారు. ఏమైందో ఏమో గానీ తర్వాత సైలెంట్ అయ్యారు. తాను పార్టీ మారడం లేదంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఓడిపోయినా దేవినేనికే చంద్రబాబుకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే దేవినేని ఉమాపై కూడా ట్విట్టర్‌లో పంచ్‌లు వేశారు. కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి దేవినేని ఉమనే కారణమని, అందుకు కొడాలి నాని ఆయనకు కృతజ్ఞుడై ఉండాలని రాశారు.
ఈ క్రమంలో మూడు నెలల కిందట తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో కేశినేని ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట. పార్టీ ఎదగనీకపోయినా.. స్వతహాగా ఎదగాలంటూ పలువురు సూచించారట. దీంతో సమయం కోసం ఎదురుచూసిన ఆయన.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఆందోళనలను తన ఎదుగుదలకు వాడుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే కడపలో జరిగిన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కడపకు చెందిన ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా పాల్గొనకపోవడం గమనార్హం. అలాగే ఇటీవల విజయవాడలో జరిగిన సభలో కూడా పాల్గొన్నారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అసదుద్దీన్ ఒవైసీతో కేశినేని వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అందుకు టీడీపీ మద్దతు తెలపకపోతే రాజీనామా చేస్తానంటూ చంద్రబాబును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానించారు. ఇకపై కూడా అనేక అంశాలపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరగాలని ఆయన నిర్ణయించుకున్నారట.