iDreamPost
iDreamPost
ప్రపంచంలోని అనేక దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా అంచనాలకు భిన్నంగా కరోనా విస్తృతమవుతోంది. ముందస్తు చర్యలతో ప్రభుత్వం స్పందిస్తోంది. వివిధ చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఆలయాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేశారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇతర వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. సిబ్బందికి తగిన రీతిలో జాగ్రత్తలు సూచించింది. ఇక ప్రధాని స్వయంగా జాతినుద్దేశించి మాట్లాడుతూ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. దాని మీద విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. అదే సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కూడా చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. అందులోనూ కేరళ ప్రభుత్వం చొరవ పలువురిని ఆకట్టుకుంటోంది.
దేశంలోనే తొలి కరోనా కేసు కేరళలో వెలుగుచూసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసించే ఎన్ ఆర్ ఐలలో కేరళ వాసుల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. అయినా అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న జాగ్రత్తలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు బయటకు రాకూడదని చెప్పడంతో సరిపెట్టకుండా వారు బయటకు రావాల్సిన అవసరం లేకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగా 20వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించింది. అందులో భాగంగా అందరికీ ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ, రెండు నెలల అడ్వాన్స్ గా పెన్షన్లు అందజేత, 2వేల కోట్ల రుణాల పంపిణీ వంటి చర్యలకు పూనుకుంది. తద్వారా ప్రజలను స్వచ్ఛందంగా ఇంట్లో ఉండేలా చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేరళ ముఖ్యమంత్రి విజయన్ సారధ్యంలో చూపుతున్న చొరవ ఆకట్టుకుంటోంది. ఇటీవల కరోనా విషయంలో సమర్థవంతంగా పనిచేసిన మహిళల్లో కేరళ ఆర్థిక మంత్రికి కూడా చోటుదక్కింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తగిన స్థైర్యాన్ని అందించడంలో అక్కడి సర్కారు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.