iDreamPost
iDreamPost
దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎన్ ఆర్ ఐలు ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అనేక అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా దేశంలోనే తొలి కేసు ఆ రాష్ట్రంలో నమోదయ్యింది. జనవరి 30నాడు దేశమంతా ఉలిక్కిపడేలా కరోనా కేసు నమోదు కావడంతో కలకలం రేగింది. అయితే వెంటనే అప్రమత్తమయిన కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. కేవలం ఎన్ ఆర్ ఐలు, ఇతర ఉన్నత స్థాయి వారినే కాకుండా సామాన్య, వలస కూలీల విషయంలో కూడా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విశేషంగా మారుతున్నాయి. దేశంలోనే మహమ్మారిని కట్టడి చేయడంలో ఓ రోల్ మోడల్ గా మారుతోంది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రాల్లో మొదటి ఒకటి రెండు స్థానాల్లో కేరళ ఉంది. కానీ ఒక్కరూ మృతి చెందకుండా తీసుకున్న జాగ్రత్తలు అందరినీ ఆ రాష్ట్రం వైపు చూసేందుకు దోహదం చేస్తున్నాయి.
కేరళ ఇటీవల ఎన్నడూ లేని స్థాయి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. శతాబ్దకాలం తర్వాత విరుచుకుపడిన వరదల నుంచి ఆ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. మధ్యలో రాజకీయ కారణాలతో మొదలయిన వివాదాలు కూడా కేరళను ఇబ్బందులకు గురిచేశాయి. ఇప్పుడు అన్నింటికీ మించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విజృంభిస్తోంది. అయినప్పటికీ ఆటంకాలను అధిగమించి కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. కమ్యూనిస్టు చైనా, కేరళ అంటూ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కేరళలో మాత్రం అన్ని పక్షాలను కలుపుకుని సీపీఎం ప్రభుత్వం సమగ్రదృక్పథంతో సాగుతోంది. దానికి తగ్గట్టుగా ఏకంగా సీఎం విజయన్, ప్రధాన ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి కరోనా ఎదర్కోవడంలో కలిసి సాగుదామని ప్రజలకు పిలుపునివ్వడం ప్రజలకు కొండంత భరోసాగా మారింది. రాజకీయాలు ఎలా ఉన్నా ఆపదలో అందరం ఒక్కటేనని అక్కడి ప్రధాన పార్టీలు చాటుకున్న తీరు ఆదర్శనీయంగా మారింది.
ఆ తర్వాత లాక్‌డౌన్ ఉండటంతో దేశమంతా స్తంభించినట్టే కేరళలో కూడా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మద్యం లభించకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పరిస్థితిని చాటుతోంది. దాంతో ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక డీ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా మద్యం ప్రియులను రక్షించే చర్యలకు పూనుకుంది. ఇక వలస కూలీలు కూడా కేరళలో ఆందోళనకు పూనుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పలువురు సొంత రాష్ట్రాలకు పయనం అవుతుండగా కేరళలో మాత్రం రాకపోకలు అనుమతించకపోవడంతో వారంతా ఆందోళనకు పూనుకున్నారు. వారందరినీ సముదాయించిన సర్కారు వలస కార్మికులకు తగిన వసతి, భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూ దానికి తగ్గట్టుగా జనతా మీల్స్ అందించే ఏర్పాట్లు చేసింది.
ఇక లాక్ డౌన్ కాలంలో అన్నార్తులకు కాల్ చేస్తే భోజనం అందించేందుకు తగ్గట్టుగా జనతా కిచెన్స్ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఆకలి ఉన్నా ఫోన్ చేయగానే ఆహారం అందించేలా ఏర్పాటు చేశారు. అన్నింటికీ మించి దేశంలోనే మొదటి సారిగా రేషన్ సరుకులు నేరుగా ఇంటింటీకి అందించి స్పూర్తిదాయకంగా నిలిచారు. రెవెన్యూ, పంచాయితీ సిబ్బందిని ఉపయోగించి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తల స్వచ్ఛంద సేవను ఉపయోగించి ఈ పని సంపూర్ణంగా విజయవంతం చేయడంతో విజయన్ సర్కారు కృషికి ప్రశంసలు దక్కుతున్నాయి. కేవలం రవాణా అందుబాటులో ఉన్న ప్రాంతాలకే కాకుండా మారుమూల గిరిజన గూడాలకు కూడా కొండలు, గుట్టలు ఎక్కి మరీ, వారి అవసరాలను తీర్చడం విశేషంగా మారింది.ఆ క్రమంలోనే పథనమ్ తిట్ట’ అనే జిల్లాకు చెందిన పీబీ నూహ్ అనే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జెనిష్ కుమార్ పనితీరు సోషల్ మీడియా నెటిజన్ల నుంచి పలు అభినందనలు అందుకుంటోంది. పథనమ్ తిట్ట అనే పట్టణం నుంచి నిత్యావసర వస్తువులను భుజాలపై మోస్తూ దాదాపు గంటన్నర నడిచి గిరిజనులున్న దట్టమైన అడవి ప్రాంతానికి చేరుకున్న తీరు ఆదర్శనీయంగా మారింది.
ప్రజలందరికీ తగిన అవగాహన పెంచి లాక్ డౌన్ విజయవంతం చేయడం, సరుకులు నేరుగా ఇంటింటీకి అందించడం వంటి కేరళ ప్రభుత్వ చర్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఇక ఐసోలేషన్ ఉన్న వారికి తగిన వసతి, ఆహారం అందించే కృషి విశేషంగా చెబుతున్నారు. అన్నింటికీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి 20వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించి అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించడం లో కేరళ సీపీఎం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవడం అవసరంగా కనిపిస్తోంది.