Dharani
Dharani
అక్షరాస్యత పెరిగింది.. అత్యాధునిక శాస్త్ర సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అయినా సరే సమాజంలో వేళ్లూనుకుని పోయిన కొన్ని దురాచారాలను, జాడ్యాలను మాత్రం పూర్తిగా రూపుమాపలేకపోతున్నాం. అత్యాధునికతతో దూసుకుపోతున్న 20వ శతాబ్దంలో కూడా కులాల పేరుతో కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో కులాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే వివాహ వ్యవస్థ, ప్రేమ విషయంలో కూడా కులాల పాత్ర పేరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండటానికి.. వారి మధ్య ప్రేమ, నమ్మకం ఉంటే చాలు. కానీ నేటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు కులాల పేరు చెప్పి.. బిడ్డల ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. కాదంటే.. ప్రాణంగా చూసుకోవాల్సిన బిడ్డల ప్రాణాలే తీయడానికి కూడా వెనకాడటం లేదు.
గత కొంత కాలంగా మన సమాజంలో పరువు హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ కులం కానీ వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో కన్న కుమార్తెనే కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఇక ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు మృతి చెందింది అనే వార్త తెలుసుకున్న ప్రియుడు.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ వ్యక్తి ముర్ఖత్వం… రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వివరాలు..
ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) ఏరియాలోని బంగారుపేట్ ప్రాంతంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ కుమార్తె క్రితి ఉంది. ఆమెకు అదే ప్రాంతంలో ఉంటున్న 24 ఏళ్ల గంగాధర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి కులాలు వేరు. కానీ క్రితి మాత్రం.. గంగాధర్‌నే పెళ్లి చేసుకోవాలని భావించింది. దీని గురించి క్రితి, ఆమె తండ్రి కృష్ణమూర్తిల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. కానీ క్రితి మాత్రం.. గంగాధర్‌నే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి క్రితి, కృష్ణమూర్తిల మధ్య.. ఇదే విషయం మీద గొడవ ప్రారంభం అయ్యింది.
గంగాధర్‌ని మర్చిపోమ్మని కుమార్తెకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు కృష్ణమూర్తి. కానీ క్రితి అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. ఆ కోపంలో.. కత్తితో కుమార్తె క్రితిని దారుణంగా పొడిచి హత్య చేశాడు కృష్ణమూర్తి. ఆ తర్వాత ఆమె డెడ్‌బాడీని ఫ్యాన్‌కు వేలాడదీశి.. ఉరివేసుకుని.. ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో.. వారు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు క్రితి మృతి చెందింది అనే వార్త తెలుసుకున్న గంగాధర్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుల జాడ్యం కారణంగా నిండు నూరేళ్లు కలిసి బతకాలని భావించిన ఇద్దరు.. చిన్న వయసులోనే మృత్యువాత పడ్డారు.