కన్నా అంటే చంద్రబాబు గొంతేనా ? ..

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న సూచనలనే ఓ రెండు రోజులు గ్యాప్ తో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయన కూడా చేస్తున్నారు. ఇక్కడే అందరిలోను అనుమానాలు బలపడుతున్నాయి. మూడు రోజుల క్రితమే నెలాఖరు వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ కంటిన్యు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నా కూడా ఇదే డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ ద్వారా డిమాండ్ చేస్తే కన్నా కూడా లేఖ రాశాడు.

ఇక ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు కుదించటం అన్యాయమంటూ చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసిన మరుసటి రోజే కన్నా కూడా లేఖ రాశాడు. అంతకుముందు ఎన్నికల కోడ్ ను వైసిపి నేతలు, అభ్యర్ధులు ఉల్లంఘిస్తు లాక్ డౌన్ సందర్భంలో వెయ్యి రూపాయలు పంపిణి చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఇదే విధమైన ఆరోపణలు చేస్తు కన్నా ఎన్నికల కమీషన్ కు లేఖ రాశాడు. సరే ఇదే విషయమై సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా లేఖ రాశాడు లేండి.

ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించటంపై చంద్రబాబు, కన్నా, రామకృష్ణ ఒకే విధంగా స్పందిస్తున్నారు. అంతకుముందు కరోనా వైరస్ సమస్యను దృష్టిలో పెట్టుకుని స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయాలని చంద్రబాబు ఇలా డిమాండ్ చేశాడో లేదో వెంటనే కన్నా, రామకృష్ణ కూడా అదే డిమాండ్ చేసేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే పై ముగ్గురిలో ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో జనాలకు అర్ధం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ముగ్గురు కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించేస్తే జనాలకు ఓ క్లారిటి అయినా వచ్చేస్తుంది. అయితే ఆ పనిమాత్రం చేయటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుతో కలిసి పనిచేయటంపై రామకృష్ణపై పార్టీలోనే వ్యతిరేకత వచ్చేస్తోంది. ఇదే విషయమై శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల కమిటీల సమావేశంలో చర్చ కూడా జరిగింది. ఇదే పద్దతిలో బిజెపిలో కూడా కన్నా వ్యవహారశైలిపైన కూడా ఆరోపణలు పెరిగిపోతున్నాయట. పార్టీ లైన్ కాదని కన్నా సొంత అజెండాతో వెళుతున్నాడనే ఆరోపణలు పెరిగిపోతున్నట్లు సమాచారం. మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే కన్నా చంద్రబాబు గొంతుగా మారిపోయినట్లు అనుమానంగానే ఉంది.

Show comments