iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరోనా కంటే తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. లాక్ డౌన్ వేళ కూడా ఆయా పార్టీల మధ్య వాదోపవాదనలు చల్లారడం లేదు. సంచలన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. అందులోనూ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సహా ఆపార్టీ పెద్దల దూకుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు కాకపుట్టిస్తోంది. ముఖ్యంగా కన్నామీద గురిపెట్టి ఆయన గుట్టు రట్టు చేసే రీతిలో విజయసాయిరెడ్డి ప్రారంభించిన విమర్శలు వేడిపుట్టిస్తున్న తీరు విశేషంగా మారుతోంది.
కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ప్రస్తుతం జగన్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ వ్యతిరేకించినప్పటికీ అనేక విషయాల్లో జగన్ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు హస్తిన పెద్దలు సిద్ధం అవుతుండడం దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినా గానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా సహా కొందరు నేతలకు ఈ విషయం బోధపడడం లేదు. ఇంకా చెప్పాలంటే అర్థమయినా తమ ధోరణి మార్చకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏపీకి చెందిన బీజేపీ జాతీయ నాయకులు కూడా జగన్ తీరు మీద విమర్శలకు సిద్ధం కాని సమయంలో కన్నా మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చివరకు బీజేపీ శ్రేణులు సైతం జీర్ణం చేసుకోలేని రీతిలో పూర్తిగా టీడీపీ గొంతు వినిపించేందుకు కన్నా సిద్ధమవ్వడం విస్మయకరంగా మారుతోంది.
చాలాకాలంగా కన్నా మాటల యుద్దం మీద కాస్త సంయమనం పాటించిన వైసీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమనడం ఇప్పుడు విశేషంగా మారింది. అందులోనూ విజయసాయిరెడ్డి తనదైన దూకుడు ప్రదర్శించి కన్నా మీద ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకి అమ్ముడుపోయారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రూ. 20కోట్లకు కన్నా అమ్ముడుపోయిన వ్యవహారంలో సుజనా బ్రోకర్ అంటూ మండిపడడంతో కన్నా షాక్ తిన్నట్టుగా మారింది. దానికి స్పందనగా ఓవైపు పరువు నష్టం వేస్తానంటూనే మరోవైపు మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేయాలంటూ కన్నా సన్నాయి నొక్కులు నొక్కడంతో చాలామందికి విషయం అర్థమయినట్టుగా కనిపిస్తోంది.
అయినప్పటికీ వెనక్కి తగ్గని విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. మొన్నటి ఎన్నికల ఫండ్ ని కూడా కన్నా దుర్వినియోగం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నాతో పాటుగా పురందేశ్వరి పేరుని కూడా ప్రస్తావించడం విశేషంగా మారింది. ఎన్నికల ఫండ్ వివరాలు అన్నీ తనదగ్గర ఉన్నాయని చెప్పడం ద్వారా కన్నాకి మరో ఝలక్ ఇచ్చారు. ఈ విషయంలో కన్నా మాత్రం ఆచితూచి స్పందిచడం ఆసక్తిగా మారింది. ఓవైపు వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విజయసాయిరెడ్డితో పాటు అంబటి రాంబాబు సహా అనేక మంది నేతలు బాణాలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో పురందేశ్వరి పేరు కూడా కన్నాతో కలిసి ప్రస్తావించడం ద్వారా ప్లాన్ ప్రకారం వెళుతున్నట్టు భావిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీలో కీలక నేతలు మాత్రం వైఎస్సార్సీపీ మీద నోరు మెదుపేందుకు సిద్ధం కావడం లేదు.
దాంతో కన్నా ఇప్పుడు వస్తావ్ కాణిపాకం అంటూ విజయసాయిరెడ్డి మరిత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది బీజేపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు పట్ల సానుకూలతతో జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న కన్నాకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వైఎస్సార్సీపీ ప్రణాళికాబద్ధంగా గురిపెట్టినట్టు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నేతలకు కాస్త సన్నిహితంగా మెలుగుతున్న విజయసాయిరెడ్డి ముందడుగు వేసిన నేపథ్యంలో కన్నా పదవీకాలానికి ముగింపు వస్తుందా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది. ఢిల్లీ పరిణామాలు గ్రహించిన నేపథ్యంలోనే ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలకు దిగినట్టు కనిపిస్తోంది. చాలాకాలంగా కన్నా పదవీ గండంతో ఉన్నప్పటికీ చివరకు దానికి తుది గడువు సమీపిస్తుందనే సంకేతాలు తీవ్రమవుతున్నాయి.
కాణిపాకం ప్రమాణాల విషయంలో కన్నా ఇక పట్టుదలకు పోయే అవకాశం లేదని కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పరువు నష్టం దావా వేస్తానని ఢాంభికాలు పలుకుతున్నప్పటికీ దానికి కూడా వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతల్లోనే పూర్తిగా కన్నాకి కలిసిరాని పరిస్థితుల్లో ఎదుటి పార్టీ మీద ఇక దండెత్తే అవకాశాలు లేవనే అభిప్రాయం బలపడుతోంది.