iDreamPost
iDreamPost
వైఎస్ జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రికి ప్రాధాన్యత పెరుగుతోంది. తొలిసారిగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఆయన ఇప్పుడు చక్రం తిప్పే స్థాయికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు ఆయనకు బాగా కలిసి వస్తున్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రికి ఆయన పట్ల ఉన్న విశ్వాసం కూడా తోడవుతున్నట్టు కనిపిస్తోంది. దాంతో ప్రస్తుతం కురసాల కన్నబాబు హవా పెరుగుతోంది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా కన్నబాబు గెలిచారు. తొలుత ఆయన ప్రజారాజ్యం తరుపున గెలిచి, తదుపురి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 43,000 ఓట్లు దక్కించుకున్నారు. అనంతరం 2016లో వైఎస్సార్సీపీలో చేరారు. ఆపార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. కాపు సామాజికవర్గం కావడం, జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో ఉన్న రాజకీయ అవగాహన ఆయనకు బాగా తోడ్పడ్డాయి. చివరకు పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని కన్నబాబుని ఓడించాలని ప్రయత్నించినా అడ్డుకోలేకపోయారు. భారీ మెజార్టీతో గెలిచిన కన్నబాబుకి జగన్ క్యాబినెట్ బెర్త్ ఖాయం చేయడంతో సుడి తిరిగినట్టయ్యింది.
వ్యవసాయ సహకార శాఖల మంత్రిగా కన్నబాబు ప్రారంభించారు. ఇటీవల మరిన్ని కీలక శాఖలు ఆయనకు దక్కాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి నుంచి ఫుడ్ ప్రోసెసింగ్ ని, మోపిదేవి వెంకటరమణ నుంచి మార్కెటింగ్ శాఖలను కూడా తీసుకుని కన్నబాబుకి కట్టబెట్టారు. దాంతో కురసాల కన్నబాబుకి జగన్ దగ్గర మంచి ప్రాధాన్యత దక్కుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రెండు కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రికి మరిన్ని శాఖలు కట్టబెట్టడం ద్వారా కన్నబాబు పనితీరుతో సీఎం సంతృప్తిగా ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి సొంత శాఖ వ్యవహారాల్లో పట్టు సాధించేందుకు కన్నబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో అసెంబ్లీలోనూ, బయటా ప్రభుత్వ, పార్టీ వాణీని వినిపించడం, రాజకీయ ప్రత్యర్థులను అడ్డుకునే ప్రయత్నంలో గట్టిగా గొంతు కలపడం ఆయనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు.
కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఎదిగేందుకు కన్నబాబుకి ప్రస్తుత రాజకీయాలు తోడ్పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సహచర కాపు మంత్రుల్లో పేర్ని నానికి మంచి వాగ్ధాటి ఉన్నప్పటికీ బందరు వ్యవహారాల్లో ఆయన బంధీ అయినట్టుగా కనిపిస్తోంద. ఆళ్ల నాని పెద్దగా చొరవ లేకపోవడంతో ఆయన పరిమితం అయిపోతున్నారు. ఇక బొత్సా వంటి సీనియర్లకు కూడా కొన్ని ఆటంకాలు ఉండడంతో కన్నబాబుకి కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నబాబుకి జగన్ దగ్గర ప్రత్యేక గుర్తింపు దక్కుతున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా కన్నబాబుకి అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకుంటున్న నేపథ్యంలో రాజకీయంగా చిన్నవయస్కుడైన కన్నబాబు భవిష్యత్తులో మరింత కీలక నేతగా ఎదిగే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.