iDreamPost
iDreamPost
కన్నా..కాణిపాకం ఎప్పుడొస్తావ్.. అంటూ ఓవైపు విజయసాయిరెడ్డి కవ్విస్తున్నారు. రెండో వైపు నిరాధారంగా, అధిష్టానం అనుమతి లేని విమర్శలు ఇక చాలించాలని కేంద్రం నుంచి కట్టడి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కుతకుతలాడిపోతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కన్నాకి ఇది కష్టకాలంగా భావిస్తున్నారు. టీడీపీ నేతలను, సుజనా చౌదరి వంటి వారిని చూసి చెలరేగిపోతే చివరకు సైలెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ అధిష్టానం తాజా పరిణామాలను సీరియస్ గా తీసుకున్న తరుణంలో త్వరలో కన్నా పదవికి కూడా కన్నం పడుతున్నట్టేనని కొందరు బీజేపీ నేతలే భావిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపీలో పార్టీ మీద కన్నాకి ఎప్పుడూ పట్టు లేదు. పైగా ఆయన దానికోసం ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించలేదు. గత సాధారణ ఎన్నికలకు ముందు గానీ, తర్వాత గానీ తన సొంత రాజకీయ వ్యూహామే తప్ప పార్టీ బలోపేతానికి కన్నా పనిచేస్తున్నట్టు కనిపించలేదనేది సగటు బీజేపీ నేతల వాదన. ఇక సుజనా చౌదరి వంటి వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కన్నా స్వరూపం పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. నేరుగా రామోజీరావుతో సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత బీజేపీ ప్రయోజనాల కన్నా ఇతరుల రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కన్నా పావులు కదిపినట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కన్నా వ్యవహారశైలి మీద బీజేపీ అధినేతలకు పలువురు ఫిర్యాదులు చేశారు. పలు ఆధారాలు సమర్పించారు. పలుమార్లు వస్తున్న ఫిర్యాదులతో ఇక కన్నాని పక్కన పెట్టాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. దానికి తగ్గట్టుగా కొత్త అధ్యక్షుడు ఎవరనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కమలదళానికి కొత్త సారధులు ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా కేవలం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మార్పు తప్ప ఏపీ పై నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు వాయిదా వేశారు. దానికి స్థానిక ఎన్నికలు సహా అనేక కారణాలున్నాయని బీజేపీలో చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడి మార్పు కొంత గందరగోళానికి దారితీస్తుందని, ఎన్నికల ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సమంజసమని కొందరు సూచిండంతో కన్నా పదవి మరికొంత కాలం కొనసాగేందుకు తోడ్పడింది.
ఈ పరిస్థితుల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాల్సిన కన్నా దానికి భిన్నంగా బాబు ఎజెండా అమలు చేయడం చాలామంది కమల నేతలకే గిట్టడం లేదు. అధిష్టానం ఎన్నిమార్లు చెప్పినా మార్పు రావడం లేదని అంచనా వేస్తున్నారు. ఆర్థిక బంధం నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని బీజేపీలోనే చర్చ సాగుతోంది. దానికి తగ్గట్టుగా వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేయడం ఆపార్టీ నేతల్లో కూడా ఆశ్చర్యం కలిగించింది. దాంతో కొందరు నామమాత్రపు స్పందన తప్ప కన్నాకి పెద్దగా బీజేపీలో కూడా మద్ధతు దక్కలేదు. పైగా కన్నా విమర్శల కారణంగా కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాల్లో బీజేపీ బద్నాం అవుతోందని తెలిసి అధిష్టానం అప్రమత్తమయ్యింది. కరోనా కిట్లు కొనుగోలు విషయంలో కన్నా వాదనలో పసలేదని , రాజకీయంగా బురదజల్లుడు వ్యవహారం ఈ సమయంలో శ్రేయస్కరం కాదని గుర్తించారు. ఈ పరిణామాలు కన్నాకి కొత్త కష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా జేపీ నడ్డా దాదాపుగా వార్నింగు లాంటి ఆదేశాలు ఇవ్వడం తో త్వరలో కన్నా కి ఉన్న సీటు కూడా ఊడిపోవడం ఖాయమనే వాదన బలపడుతోంది.
వాస్తవానికి వైఎస్సార్సీపీ , బీజేపీ మధ్య హస్తినలో మంచి సఖ్యత ఉంది. దానిని అర్థం చేసుకుని మసులుకోవాల్సిన కన్నా తనకు తోచినట్టుగా సాగడంతో చివరకు బీజేపీలో కూడా ఆయనకు మద్ధతు దక్కని పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఏపీలో బీజేపీ ఎదుగుదులకు కన్నా తీరు గుదిబండలా మారిందని, గతంలో కొందరు నేతలు కూడా ఇదే రీతిలో వ్యవహరించిన మూలంగానే తాము ఎదగలేకపోయామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో టీడీపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేయడం తగదనే వాదన వస్తోంది. ఈ తరుణంలో కన్నాకి కష్టాలు అనివార్యంగా చెప్పవచ్చు. అదే సమయంలో తాజా ఎపిసోడ్ లో హఠాత్తుగా వెనక్కి తగ్గడమా..లేక మరోమార్గం అన్వేషించడమా అన్నదే ఇప్పుడు కన్నాకి సైతం అంతుబట్టని అంశంగా మారింది.