iDreamPost
android-app
ios-app

రండి మిత్రమా.. మీకు స్వాగతం. మీ దారి రహదారి.. అంటూ రజనీకాంత్ ని పొగిడిన కమల్ హాసన్

రండి మిత్రమా.. మీకు స్వాగతం. మీ దారి రహదారి.. అంటూ రజనీకాంత్ ని పొగిడిన కమల్ హాసన్

రండి మిత్రమా మీకు స్వాగతం.. మీ దారి రహదారి.. అని రజనీకాంత్ ని పొగిడింది ఎవరో కాదు, తన చిరకాల మిత్రుడు, సహా నటుడు కమల్ హాసనే. కమల్‌హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఇంతకీ విషయం ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్‌ త్వరలో రాజయ పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు తమిళనాట ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఆరంభం నుంచి రజనీకాంత్ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు సమ దూరంగా ఉంటూ వస్తున్నారు.

కాగా రజని కాంత్ ఇటీవలి కాలంలో ముఖ్యంగా సీఏఏ లాంటి కొన్ని అంశాలలో భారతీ జనతా పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చెయ్యడంతో కొన్ని వర్గాలనుండి రజనీకాంత్ వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుదారుడనే ముద్ర పడింది. ఆ మధ్య తూత్తుక్కుడిలో జరిగిన కాల్పల సంఘటనలో దేశ ద్రోహులు చోరబడ్డారని రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని ప్రశంసిస్తూ బలవంతుడిగా పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు మద్దతు పలికారు. ఇలా ఇటీవల కాలంలో తరచూ కేంద్రంలోని బిజెపి విధానాలను ప్రశంసిస్తూ మాట్లాడంతో తమిళనాడులో బలపడడానికి బిజెపి రజనీకాంత్ తో చర్చలు జరిపి ఆయన్ని పార్టీలోకి రమ్మని ఆహ్వానించిందని, అందువల్లే రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ప్రచారం చాలా గట్టిగానే జరుగుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఢిలీలో జరిగిన అల్లర్లపై రజనీకాంత్ స్పందిస్తూ అల్లర్లను అదుపు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తానూ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొత్తగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ముఖ్యంగా రజనీకాంత్ చిరకాల మిత్రుడు, సహా నటుడు కమలహాసన్‌ ‘మక్కళ్‌ నీది మయ్యం’ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన “శహభాష్‌ మిత్రమా.. మీరు అలానే ఉండండి.. అలానే రండి.. మీ దారి రహదారి. ప్రత్యేక దారి కాదు. ఇకపై మీరు ఎంచుకున్న దారి రాచమార్గమే.. మీకు శుభాకాంక్షలు..” అని మిత్రుడిని పొగుడుతూ కమల్ హాసన్ తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్‌ తో కలిసి పనిచేయటానికి కమల్ హాసన్ ఆసక్తి చూపుతున్నాడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నటుడు రజనీకాంత్‌ ఎటువంటి స్పష్టత ఇస్తాడో చూడాలి. అయితే గతంలో ఒక ఇంటర్యూ లో రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసరం అనుకుంటే తానూ కమల్ హాసన్ తో పని చేస్తానని ప్రకటించిన సంగతిని తెలిసిందే. రజనీకాంత్‌ హీరోగా కమల్ హాసన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా కోలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది.

ఏది ఏమైనా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో అసలు రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తాడా?? ఒక వేళా వస్తే రజనీకాంత్ ఎవరితో జత కడతాడు ?? లేదా బయటి నుండి ఎవరికైనా మద్దతిస్తాడా?? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్నిరోజుల్లో రాజనీకాంత్ నుండే ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.