గతనెల 19 న భారతీయుడు 2 సెట్లో సంభవించిన ఘోర ప్రమాదంతో సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మృతి చెందడంతో పాటు తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాద విచారణను సీబీసీఐడీకి తమిళనాడు ప్రభుత్వం అప్పగించింది. కాగా కమల్ హాసన్ తాజాగా పోలీసుల తీరుపై హైకోర్టుకి వెళ్లడంతో మరోసారి ఇండియన్ 2 ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తనను పోలీసులు విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టులో అత్యవసర పిల్ ను దాఖలు చేసారు కమల్ హాసన్..
పోలీసుల విచారణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని కమల్ హాసన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా లైకా సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తుంది. భారతీయుడు సెట్లో జరిగిన ప్రమాదం తరువాత చిత్ర నిర్మాతలకు కమల్ హాసన్ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలొచ్చాయి. ప్రస్తుతం కమల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కమల్ హాసన్ కి అనుకూలంగా తీర్పును ఇస్తుందో లేదో వేచి చూడాలి.