iDreamPost
android-app
ios-app

కరోనా కాలంలో రాజకీయ వేడి- బీజేపీ vs టిఆర్ఎస్

కరోనా కాలంలో రాజకీయ వేడి- బీజేపీ vs టిఆర్ఎస్

తెలంగాణలో కరోనా పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చేస్తున్నదని అక్కడి బిజెపి నేతలు గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని టిఆర్‌ఎస్‌ వైపు నుంచి మంత్రులు, నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు.

అయితే ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి‌ నడ్డా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించడంతో అదే స్థాయిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఎదురుదాడికి దిగారు. అసలు రాష్ట్రానికి కేంద్ర బిజెపి చేసిందేమి లేదని స్పష్టం చేశారు. పైపెచ్చు రాష్ట్రానికి వస్తున్న టెస్టుల మిషన్‌లను ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బిజెపి తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెరిగిపోయాయి.ఒకేసారి వేలమందికి పరీక్షలు చేసేందుకు రోషె కంపెనీ తయారు చేసిన కోబాస్‌ 8800 మిషన్‌ ను దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మంత్రులు కెటిఆర్‌, ఈటల రాజేందర్‌ జరిపిన సంప్రదింపులతో సాయం కింద ఈ పరికరాన్ని రాష్ట్రానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

ఇలాంటి రెండు మిషన్లను సమకూర్చుకోవడం ద్వారా ఒకే సారి 10 వేల మందికి పరీక్షలు చేయడానికి వీలు కలుగుతుంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరికరాలు లేకపోవడం గమనార్హం. అయితే ఈ పరికరాన్ని రాష్ట్రం సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిన కొంత మంది కేంద్రంలోని పెద్దలు పావులు కదిపి 2021లో అసెంబ్లీ ఎన్నికలున్న కలకత్తాకు తరలించారని నెటిజన్లు పోస్టింగ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్‌ రోషె డయాగస్టిక్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి సంజరు సింగ్‌ కు మే 31న లేఖ రాశారు.

ప్రధానమంత్రి కార్యాలయం, సాధికారిత బందం-2 ఆదేశాల మేరకు కోబాస్‌ 8800 మిషన్‌ ను అత్యవసరంగా పశ్చిమబంగా (కలకత్తా)కు తరలించాలని కోరారు. రోషె సంస్థ బిజినెస్‌ హెడ్‌ జయ భారత్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కు జూన్‌ 14న లేఖ రాశారు.

ముందు హామి ఇచ్చినట్టు రాష్ట్రానికి ఆ మిషన్‌ ను ఇవ్వలేకపోతున్నామని, ఐసిఎంఆర్‌ ఆదేశాల మేరకు దాన్ని కలకత్తాకు మళ్లించినట్టు పేర్కొన్న రెండు లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. బిజెపికి ఎన్నికలే తప్ప కరోనా పట్టదా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ రకంగా కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తెలంగాణలో అధికారి టిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి మధ్య ఓట్ల లొల్లి జరుగుతుంది. రెండు పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర బిజెపి నేతలే విమర్శలు గుప్పించేవారు. కాని ఇప్పుడు బిజెపి జాతీయ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.‌ దీంతో తెలంగాణలో కరోనా నేపథ్యంలో రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి.