iDreamPost
iDreamPost
గత ఏడాది ఓటిటిలో విడుదలై అద్భుతమైన ప్రశంసలతో గొప్ప విజయాన్ని అందుకున్న సూర్య జైభీమ్ ఆస్కార్ చివరి మెట్టు మీద ఉన్నట్టు ఇంగ్లీష్ మీడియా టాక్. ఇవాళ నామినేషన్ల లిస్టు ప్రకటించబోతున్నారు. అందులో జైభీమ్ పేరుందనేది అక్కడ చర్చలో ఉన్న హాట్ టాపిక్. ఒక భారతీయ సినిమాకు ఈ గౌరవం దక్కి ఏళ్లవుతోంది. అందుకే సూర్య అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులందరూ జైభీమ్ ఈ రేసులో గెలవాలని కోరుకుంటున్నారు. దీనికి ఊతమిచ్చేలా న్యూ యార్క్ టైమ్స్ అవార్డు కాలమిస్ట్ కైల్ బుచానన్ అడిగిన ప్రశ్నకు రాటెన్ టమాటోస్ ఎడిటర్ జాక్వలిన్ కోలీ పాజిటివ్ గా సమాధానం ఇవ్వడం ఆస్కార్ ఆశలను అమాంతం పెంచేస్తోంది.
బెస్ట్ పిక్చర్(ఉత్తమ చిత్రం)క్యాటగిరీలో అవార్డు వస్తుందని చెప్పడమే కాదు ఈ మాట నమ్మమని కోలీ స్పష్టంగా చెప్పడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా సూర్య నటించి నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఒకే స్పందన దక్కించుకుంది. థియేటర్లను మిస్ అయినప్పటికీ డిజిటల్ ఆడియన్స్ దీనికి బ్రహ్మరధం పట్టారు. ఆకాశం నీ హద్దురాని మించి హిట్టు కొట్టడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు నామినేషన్ల దగ్గరే ఆగిపోకుండా జైభీమ్ పురస్కారం కూడా అందుకుంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలో అదో మైలురాయి అవుతుంది. కాకపోతే అవార్డుల ప్రధానం జరిగే దాకా సస్పెన్స్ ని భరించక తప్పదు.
నిజానికి ఆస్కార్ ని మించిన అర్హత ఉన్న సినిమాలు ఇండియాలో ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. పాత బ్లాక్ అండ్ వైట్ కాలంని మినహాయిస్తే హే రామ్, ద్రోహ్ కాల్, లగాన్, రుడాలి, బజార్, సాగర సంగమం లాంటి ఎన్నో క్లాసిక్స్ అన్ని భాషల్లోనూ రూపొందాయి. కానీ గుర్తింపు విషయంలో మాత్రం ఆస్కార్ అకాడెమి వివక్షను చూపిస్తూనే ఉంది. దీని మీద ఇండస్ట్రీ పెద్దలు గతంలో గళం విప్పారు కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రయత్నం మానేశారు. ఆస్కార్ ఇవ్వనంత మాత్రాన మన స్టాండర్డ్ ఏమి పడిపోదు. కనీసం గుర్తించడంలో ప్రామాణికత పాటిస్తే ఖచ్చితంగా ఏడాదికి ఒక్క భారతీయ సినిమా అయినా ఆస్కార్ ని తన ఖాతాలో వేసుకుంటుంది.
Also Read : Bigg Boss OTT : కొత్త రూపంలో రాబోతున్న గేమ్ షో