iDreamPost
iDreamPost
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అనూహ్యంగా డిఫెన్స్ లో పడింది. విచక్షణతో తీసుకున్న నిర్ణయం అంటూ ప్రకటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు కొంత సందిగ్ధంలో పడినట్టు కనిపిస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో జరిగిన తప్పిదం తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని ఆయన గ్రహించినట్టు కనిపిస్తోంది. దాంతో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నాల్లో ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు.
ఆదివారం ఉదయాన్నే ఎన్నికల వాయిదా ప్రకటనను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చేశారు. ఆ వెంటనే సీఎం సీరియస్ అయ్యారు. హుటాహుటీన గవర్నర్ ని కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని పిలిచి మాట్లాడాలని కోరారు. ఆ వెంటనే మీడియా ముందు తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎన్నికల వాయిదా విషయం కుట్రపూరితంగా జరిగిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ విజయపరంపరను సహించలేక, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్రగా ఆయన అభివర్ణించారు.
అంతటితో ఊరుకోకుండా రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎన్నాళ్లు కొనసాగితే అన్ని రోజూ ఎన్నికలు నిలిపివేస్తారా అంటూ నిలదీశారు. కరోనా అనేది సాకు మాత్రమేనని చెప్పారు. అసలు కరోనా సమస్య గురించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా అధికార యంత్రాంగంతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం అనే అంశాన్ని ఎత్తిచూపారు. మీడియా సమావేశంలో తన పక్కనే ఉన్న హెల్త్ డిపార్ట్ మెంట్ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డితో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. పోనీ సీఎస్ ని సంప్రదించారా అని నిలదీశారు. చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉన్న ఎన్నికల సంఘం కార్యదర్శికే విషయం తెలియదని, ఎవరో తయారు చేసిన ఉత్తర్వులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చదివారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ విషయమే ఇప్పుడు రమేష్ కుమార్ ని ఇక్కట్లలోకి నెట్టేలా కనిపిస్తోంది. ఆ వెంటనే ఆయన విడుదల చేసిన ఉత్తర్వుల్లో జాతీయ స్థాయి అధికారులను సంప్రదించామని చెప్పారు. కానీ అందులో వారెవరూ అన్నది నిర్థిష్టత లేదు. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రాష్ట్ర స్థాయి అధికారులను తోసిపుచ్చి, జాతీయ స్థాయి అధికారులతో మాట్లాడతారా..అలాంటి అవకాశం ఉందా..ఉంటే రాష్ట్రస్థాయిలో పరిస్థితి గురించి సంప్రదించాల్సిన అవసరం లేదా..తన పరిధిలో లేని వైద్య ఆరోగ్య విభాగాల విషయంలో పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం లేదా ..అనే అంశాలే రమేష్ కుమార్ కి సమస్యగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఆయన జాతీయ స్థాయిలో ఎవరిని సంప్రదించారన్నది కోర్టులో వెళ్లడించాలసి ఉంటుంది. వాస్తవం భిన్నంగా ఉంటే మాత్రం ఇరకాటం కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.
దానికితోడుగా సీఎం చేసిన మరో కీలక అభ్యంతరం ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత అధికారులపై తీసుకున్న చర్యలు. ఈ విషయంలో కూడా ఎన్నికల సంఘం జవాబుదారీగా నిలవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఎన్నికలు కొనసాగితే విధుల నుంచి తప్పించమని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది గానీ, ఎన్నికలే నిలుపుదల చేసి, చర్యలు తీసుకోవాలనే నిర్ణయం ఏమిటన్నది కూడా రమేష్ కుమార్ కి తగిన సమాధానం దొరికే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించబోతున్న తరుణంలో మరోసారి వ్యవహారం వేడి రాజేసేలా కనిపిస్తోంది. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య మొదలయిన వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందోననే చర్చ సాగుతోంది.