iDreamPost
iDreamPost
ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీలకు జై కొట్టారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో బీసీల మద్ధతు అనూహ్యంగా కొల్లగొట్టిన జగన్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు. లోక్ సభ బరిలో బీసీలకు పెద్ద పీట వేసిన వైఎస్సార్సీపీ అదే పంథాను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభ స్థానాల్లో కూడా 50శాతం బీసీలకు కట్టబెట్టడం చారిత్రక నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో పార్టీ తరుపున బీసీలకు 34 శాతం సీట్ల రిజర్వేషన్లను ప్రస్తావించిన జగన్ తనకు అవకాశం ఉన్న రాజ్యసభ సీట్లలో ఏకంగా సగం బీసీ వర్గాలకు కేటాయించడం చర్చనీయాంశం అవుతోంది. జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా కూడా పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు మంత్రులను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా నమ్మకస్తులైన నేతలకు పెద్ద పీట వేయడానికి వెనుకాడరని మరోసారి చాటిచెప్పారు.
టీడీపీ హయంలో రెండేళ్ల క్రితం వరకూ జరిగిన ఎన్నికల్లో కార్పోరేట్లకు మాత్రమే రాజ్యసభ సీట్లు దక్కేవి. చివరకు చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినా, ఆయా నేతలు ఎంత ఆశలు పెట్టుకున్నా వాళ్ళందరికీ నిరాశ తప్పని స్థితి కనిపించేది. యనమల రామకృష్ణుడు స్వయంగా తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందని చెప్పినా బాబు ఆశీస్సులు లభించలేదు. వర్లరామయ్య వంటి వారికి కన్నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సుజనా , సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి బడా కార్పోరేట్ , కాంట్రాక్టర్లకే పెద్దల సభ అన్నట్టుగా కనిపించింది. చంద్రబాబుని, పార్టీ నమ్ముకున్న నేతల ఆశలన్నీ అడియాశలు కావాల్సిన పరిస్థితి ఉండేది.
వైఎస్సార్సీపీ అధినేత మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. నాలుగు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో రిలయెన్స్ యాజమాన్యం స్వయంగా సీఎంని కలిసి విన్నవించిన తరుణంలో నేత్వాని పేరుని ఖాయం చేశారు. ఆ తర్వాత మిగిలిన మూడు స్థానాల్లో గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు అయోధ్య రామిరెడ్డికి ముందు నుంచి ఊహించినట్టుగానే అవకాశం ఇచ్చారు. కానీ అనూహ్యంగా మిగిలిన రెండు స్థానాలను మాత్రం బడుగు వర్గాలకు చెందిన నేతలకు కట్టబెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ఈ ఇద్దరూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా ఎమ్మెల్సీగా ఉన్న బోస్ కి, ఎమ్మెల్సీని చేసి మోపిదేవికి జగన్ మంత్రి హోదా కట్టబెట్టారు. ఇప్పుడు మండలి రద్దవుతున్న తరుణంలో నేరుగా కేంద్రంలో ఎగువ సభకు వారికి లైన్ క్లియర్ చేయడం విశేషమే.
రాజ్యసభ టికెట్ అంటే వంద నుంచి 150 కోట్ల వరకూ నిధులు సమకూర్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ వ్యవహారం బాహాటంగానే సాగుతోంది. కానీ ఏపీలో మాత్రం కేవలం తనను నమ్ముకున్న నేతల్లో ముగ్గురిని ఎంపికి చేయడం ద్వారా జగన్ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారు. 2012లో జగన్ పార్టీ పెట్టిన సమయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తన మంత్రి పదవిని వదులుకుని వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తర్వాత మోపిదేవి నేరుగా జగన్ కేసుల్లో సహనిందితుడిగా జైలు పాలుయ్యారు. ఇలా ఈ ఇద్దరు నేతలు జగన్ కి అత్యంత సన్నిహితులుగా , నమ్మకస్తులుగా గుర్తింపు పొందారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో జనం మనసులు గెలవలేకపోయినా, జగన్ మనసులో వారికున్న స్థానానికి తగ్గట్టుగా మంచి పదవులు దక్కించుకుంటున్నట్టు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా రాజమండ్రి వంటి ఎంపీ సీటులో తొలిసారిగా బీసీలకు అవకాశం కల్పించిన జగన్, కర్నూలు, అనంతపురం వంటి సీట్లు కూడా బీసీలకు కట్టబెట్టడం ద్వారా కొత్త సమీకరణాలకు తెరలేపారు. ఇప్పుడు కూడా అదే పంథాలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బోస్, మత్స్యకార వర్గీయుడైన మోపిదేవికి రాజ్యసభ టికెట్లు కేటాయించడం ద్వారా బీసీలకు వైఎస్సార్సీపీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని చాటుకుంటున్నారు.
ప్రస్తుతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల నేపథ్యంలో టీడీపీ బీసీ కార్డు ప్రయోగించి జగన్ మీద విమర్శలు గుప్పిస్తోంది. కానీ వాస్తవానికి జగన్ ప్రభుత్వం తొలుత 59 శాతం రిజర్వేషన్లతో అంతా సన్నద్ధమయిన తరుణంలో చివరి నిమిషంలో టీడీపీ నేత వేసిన పిటీషన్ తో కోర్ట్ తీర్పు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో కోర్ట్ తీర్పునకు అనుగుణంగా స్థానిక ఎన్నికలకు వెళుతూ పార్టీ సీట్ల కేటాయింపులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన జగన్, దానికి తగ్గట్టుగా రాజ్యసభ స్థానాలకు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పాడంటే..చేస్తాడంటే అంటూ సాగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.