iDreamPost
android-app
ios-app

జగన్‌ మనస్సుతో చూశాడు

జగన్‌ మనస్సుతో చూశాడు

అర్హులైన ఏ ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందలేదన్న మాట రాకూడదు. అధికారులు లబ్ధిదారులు పట్ల మంచి మనస్సుతో వ్యవహరించండి. ఇవీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తరచూ చెప్పే మాటలు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషిననీ సీఎం జగన్‌ నిత్యం రుజువు చేసుకుంటూనే ఉంటారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ఆ మేరకు ప్రజలకు మేలు చేస్తూ వారి మన్ననలను చూరగొంటున్నారు.

అర్హులకే ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంతో ఇటీవల పింఛన్‌ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేశారు. నిబంధనలను మరింత సరళీకరించారు. పింఛన్‌ తీసుకునే అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. అంతకు ముందు ఐదెకరాల పరిమితిని పదెకరాలకు పెంచారు. విద్యుత్‌ వినియోగం 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లకు పెంచారు. అయితే ఈ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంతో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది అనర్హులయ్యారు. భూమి వారసులకు పంచి ఇచ్చినా.. అది వారికి బదలాయింపు జరగకపోవడం, ఉమ్మడి కుటుంబంలో ఒకే మీటర్‌పై విద్యుత్‌ బిల్లు వస్తుండడంతో వీరందరూ నష్టపోయారు.

అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి వినతులు వెళ్లడంతో సీఎం జగన్‌ స్పందించారు. లబ్ధిదారుల వినతులు పరిశీలించి ఏ చిన్న అవకాశం ఉన్నా వారికి మళ్లీ పింఛన్‌ ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన వారికి ఫిబ్రవరి పింఛన్‌ కూడా కలిపి మార్చిలో రెండు నెలల పింఛన్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు తమకు వచ్చిన వినతులను వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి అవసరమైన పత్రాలు సేకరించి అర్హులైన వారి పింఛన్లు మళ్లీ పునరుద్ధరించారు. ఫలితంగా గతంలో అనర్హులైన 5 లక్షల మందిలో 3 లక్షల మందికి వచ్చే ఒకటో తేదీన పింఛన్‌ ఇవ్వబోతున్నారు. ఈ మూడు లక్షల మందికి రెండు నెలల పింఛన్‌ ఇవ్వనున్నారు.

మొత్తం మీద మార్చి ఒకటో తేదీన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది పింఛన్‌ అందుకోబోతున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 53.19 లక్షల పింఛన్‌ లబ్ధిదారులుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60 లక్షలకు చేరింది. జగన్‌ ప్రభుత్వం కొత్తగా 6.81 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా పింఛన్‌ ఇచ్చేలా ప్రభుత్వం సరికొత్త విధానం అమలు చేస్తోంది. ఫలితంగా ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న అర్హులకు వచ్చే నెలలో పింఛన్‌ అందుతుంది.