మ్యానిఫెస్టోలకు ప్రాణం పోసిన జగన్

ఎన్నికల మ్యానిఫెస్టో అంటే తమ ఆశలు ఆశయాలు తీర్చే భరోసాపత్రం అనే స్థాయి నుండి ఓటర్లను నమ్మించి మోసం చేయటానికి తయారు చేసిన ఒక చిత్తు కాగితం అనే భావన ప్రజల్లో నాటుకుపోయేలా చేసిన ఘనత రాజకీయ నాయకులది. తాము ఎన్నుకునే నాయకులు కొండంత చెబుతారు కానీ పిసరంతయిన చేయకపోతారా అని బేరీజు వేసుకుని ఓటర్లు నాయకులను ఎన్నుకునే దుస్థితి ఏర్పడింది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మ్యానిఫెస్టో అనే మాట ఎంత చులకనైందో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్.టి.ఆర్ ని గద్దె దింపి ముఖ్యమంత్రి అయ్యాక, ఎన్.టి రామారావు 1994లో మ్యనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలైన రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేదం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ ను ఆర్ధిక పరిస్థితులు సాకుగా చూపి అటక ఎక్కించారు. ఇక 1999, 2014 ఎన్నికల్లో ఆయన నేరుగా మ్యానిఫెస్టొలో హామీలు ప్రకటించి గెలిచిన తరువాత కూడా ఇదే పరిస్థితి.

1999లో నేరుగా చంద్రబాబే స్వయంగా ప్రజల ముందు నిలబడి తమ పార్టి విధి విధానాలు ఇవి, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు నెరవేర్చే హామీలు ఇవి అని ఎంతో అర్బాటంగా మ్యానిఫెస్టోలను ప్రకటించారు. కాని గెలిచిన తరువాత ఆయన మ్యానిఫెస్టోలో ప్రకటించిన కోటి ఉద్యోగాలు,100 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, సంవత్సరానికి 7 లక్షల ఇళ్ళు హామీలను గాలికి వదిలేసారు. ఇక 2014లో రాష్ట్ర విభజన నేపద్యంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తమ మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారు అందులో ముఖ్యమైనవి సంపూర్ణ రుణమాఫి, ఇంటికొక ఉద్యోగం, డ్వాక్రా రుణమాఫి హామీలతో పాటు ఇచ్చిన 650 హామీలలో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదు. పైగా మ్యానిఫెస్టో ప్రజలకి అందుబాటులో ఉంటే తాము చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అని ఏకంగా తమ అధికారిక వెబ్ సైట్ నుండి ఆ మ్యానిఫెస్టోని తొలగించారు.

దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రణాళికలని రూపొందించాల్సిన పార్టీలు, చంద్రబాబు లాంటి నాయకులు అవేమీ పట్టనట్టు కేవలం అదికారం కైవసం చేసుకోవడం కోసమే ఒక ప్రణాళిక ప్రకారం మోసపూరిత మాటలతో మ్యానిఫెస్టోలను తయారు చేస్తూ వాటి పై ప్రజల్లో పూర్తిగా అపనమ్మకం ఏర్పడేలా వాటిని దిగజార్చారు. ఈ పరిస్థితుల్లో 2004లో వేగుచుక్కలా వై.యస్ తన మ్యానిఫెస్టో తో వచ్చి ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా , చెప్పిన హామీ చెప్పినట్టుగా 5ఏళ్లలో పూర్తిగా నెరవేర్చి మళ్లీ ఎన్నికలకు వెల్లేనాటికి నేను వాగ్ధానం చేసి అమలకు నోచుకోని హామీలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ప్రజల మద్యలో నిలబడి ప్రజలకే ప్రశ్నలు వేసి మ్యానిఫెస్టోలపై ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకాలకు జీవం పోసారు. 2009 ఎన్నికలలో వై.యస్ ఒక్క కొత్త హామీ కూడా ఇవ్వకుండా నా పరిపాలన నచ్చితేనే ఓట్లు వేయండి అనే సాహసోపేతమైన స్టేట్మెంట్తో ఎన్నికలకు వెళ్లి రెండవ సారి కూడా విజయఢంకా మోగించి ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణశ్వీకారం చేశారు. అయితే తిరిగి పరిపాలనా పగ్గాలు చేపట్టిన 100రోజుల్లోనే తన పధకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో అని నేరుగా ప్రజలను అడిగి తానే స్వయంగా తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి వెలుతూ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.

వై.యస్ మరణానతరం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి తమలో తాము కుమ్ములాడుకుంటు తిరిగి ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. అలాగే రాష్ట్ర విభజన తరువాత నేను పూర్తిగా మారిపోయాను నన్ను నమ్మండి అంటు 650 హమీల మూటతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు తిరిగి పాత పద్దతినే అవలంబించారు. 5ఏళ్ళలో ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలని పూర్తిగా మోసం చేశారు. మ్యానిఫెస్టో లోని హామీలు అంటేనే ప్రజలు నవ్వుకునేలా వాటి స్థాయిని పూర్తిగా దిగజార్చారు.

ఈ భూమిపై రాత్రి పగలు ప్రతిరోజు మారుతున్నట్టే మంచి చెడు కలిసే వుంటాయి అని నిరూపించేలా గత ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నాడు , నవరత్నాల పేరుతో మ్యానిఫెస్టోని విడుదల చేసిన జగన్ అన్ని మతాలవారు తమ మత గ్రందాలను ఎంత పవిత్రంగా చూసుకుంటారో తాను అలాగే తను ఇచ్చిన మ్యానిఫేస్టోను భావిస్తానని, మేనిఫెస్టో లో చేర్చిన అంశాలు అమలు చేసినప్పుడే విలువ ఉంటుందని, మేనిఫెస్టో లో పెట్టిన అంశాలను చేసి చూపించి ప్రజలను ఓట్లను అడిగే పరిస్థితి తిరిగి తీసుకువస్తానని చెప్పి, ప్రజల నమ్మకాన్ని చూరగోని తిరుగులేని మెజారిటితో ప్రభంజనం సృష్టించారు.

ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగన్ తాను ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగానే తన మ్యానిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తు , ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ భారత దేశ చరిత్రలో తన అంత వేగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత మరొకరు ఉన్నారా అని దుర్బిణి వేసి వెతికేలా రాజకీయ వ్యవస్థకే ఒక సవాల్ విసిరారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న దానిని సాకు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గెలిచిన ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన 90 % హామీలను నెరవేర్చారు. ఇక తాజాగా ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఏకంగా , ఏ పధకం ఎప్పుడు ప్రభుత్వం ప్రజలకు అందించబోతొందో పూర్తి వివరాలుతో పొందుపర్చిన సంక్షేమ క్యాలండర్ ని విడుదల చేసి ప్రజా సంక్షేమం అనే మాటకు తాను ఒక ట్రేడ్ మార్క్ లా మారి ఒక సరికొత్త అద్యాయానికి తెరలేపి ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలైన మ్యానిఫెస్టో అనే పదానికి తిరిగి విలువ సంతరించుకొనేలా చేశారు.

Show comments