Idream media
Idream media
ప్రస్తుతం మానవ సమాజం కరోనా లాంటి విపత్తులు మునుపెన్నడూ చూసి ఉండదు. 1940వ దశకంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసిన వారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. వారు కూడా కరోనా వైరస్ లాంటి విపత్తులు చూసి ఉండరు. ప్రస్తుతం మానవ జాతి పెనుముప్పును ఎదుర్కొంటోంది. కనిపించే శత్రువుతో యుద్ధం చాలా సులువు. కానీ కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా చేయడం. ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా ఈ విషయంపైనే మల్లగుల్లాలు పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు.. అనే తేడా లేకుండా ప్రతి దేశం కరోనా వైరస్ దాటికి విలవిల్లాడిపోతోంది.
కరోనా వైరస్ వల్ల ఆయా దేశాలు వైద్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నాయో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల తో పాటు అభివృద్ధి చెందిన దేశాల యొక్క డొల్లతనాన్ని కరోనా తేటతెల్లం చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఆసుపత్రులు లేక, ఉన్న ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు క్యూబా, భారత్ వంటి దేశాలు సహాయాన్ని అర్ధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారతదేశ అదృష్టమో లేక ప్రభుత్వ ముందుచూపు వల్లనో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేదు. అమెరికా, యూరప్ దేశాలలో లాగా మన దేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంటే మన దుస్థితి మరింత దారుణంగా ఉంటుందనడం లో సందేహం లేదు. కరోనా మహమ్మారి ఈతరం ప్రభుత్వాలకు, పాలకులకు కనువిప్పు కలిగించింది. విద్య, వైద్యానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో కరోనా చాటి చెప్పింది. అందుకే పలు ప్రభుత్వాలు కరోనా బారి నుంచి తన ప్రజలను కాపాడుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి మళ్లీ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.
కరోనా లాంటి ఆపద మళ్లీ వస్తే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రణాళిక రచించి, ఆచరణలో పెడుతోంది. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వార్డు, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే గ్రామాల్లో రెండు వేల జనాభా కి ఒక సచివాలయం, పట్టణాల్లో ప్రతి నాలుగు వేల జనాభాకు ఒక వార్డు సచివాలయం ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటికి అనుబంధంగా అక్కడే వార్డు, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య అవసరాలన్నీ ఈ క్లినిక్ ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రణాళిక రచించింది.
వచ్చే ఏడాది వచ్చే ఏడాది నాటికి వార్డు, విలేజ్ క్లినిక్స్ ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రాధమిక వైద్యం తో పాటు కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రారంభంలో నే అరికట్టేందుకు ఈ క్లినిక్స్ ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సచివాలయ పరిధిలో ఆశా వర్కర్, హెల్త్ అసిస్టెంట్ ఉండగా.. క్లినిక్స్ ఏర్పాటు చేసిన తర్వాత.. బీఎస్సి నర్సింగ్ విద్యార్హత గల వారిని ప్రతి క్లినిక్ కు ఒకరిని శాశ్వత ప్రాతిపదికన నియమించనుంది.