iDreamPost
android-app
ios-app

బిసిలు ఇక టిడిపికి శాశ్వతంగా దూరమైనట్లే

  • Published Jun 04, 2020 | 4:43 AM Updated Updated Jun 04, 2020 | 4:43 AM
బిసిలు ఇక టిడిపికి శాశ్వతంగా దూరమైనట్లే

’బిసిలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు…బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా’… ఇది మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటను అధికారంలోకి రాగానే ఆచరణలో చూపించాడు. మామూలుగా ఎన్నికలకు ముందు నేతలు ఏవేవో మాటలు చెప్పటం, హామీలివ్వటం మామూలే. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు పద్దతేంటో చూసిన వాళ్ళకు ఈ విషయం బాగా అర్ధమవుతుంది. కానీ తాను అలాంటి వ్యక్తిని కానని,మాటిస్తే నెరవేర్చే వాడినంటూ జగన్ ఆచరణలో చూపించాడు.

వైసిపి అధికారంలోకి రావటానికి కీలకమైన నవరత్న పథకాల అమలుకు జగన్ ఎప్పుడైతే శ్రీకారం చుట్టాడో అప్పుడు బిసిలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అందరికీ అర్ధమైయ్యింది. అధికారంలోకి వచ్చి ఏడాదే అయినప్పటికీ 15 పథకాల్లో బిసిలకు పెద్ద పీట వేశాడు. జనాభాలో దాదాపు సగం అయిన కారణంగా వారికే పథకాల లబ్దిలో మేజర్ షేర్ అందుతోంది. పథకాల లబ్దిదారుల్లో వివిధ వర్గాలున్నప్పటికీ బిసిలే దాదాపు 1.78 కోట్లమంది బెనిఫిట్స్ అందుకున్నారు. వీళ్ళందరికీ వివిధ పథకాల్లో సుమారు రూ. 19,308 కోట్ల మేర లబ్ది పొందినట్లు సమాచారం. గడచిన ప్రభుత్వాలతో పోలిస్తే ముఖ్యంగా చంద్రబాబు హయాంలో ఏమి జరిగిందో పోల్చి చూసినపుడు భవిష్యత్తులో బిసిలు తెలుగుదేశంపార్టీ వైపు చూడాల్సిన అవసరం ఉండదేమో అనే అనిపిస్తోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వైఎస్సార్ రైతుభరోసాలో 23.29 లక్షల మంది రూ. 4780 కోట్లు అందుకున్నారు. వైఎస్సార్ పెళ్ళికానుకలో సుమారు 29 లక్షల మంది రూ. 7239 కోట్లు అందుకున్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకంలో 48.38 లక్షల మంది లబ్దిదారులు రూ. 720 కోట్లు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలే ఉన్నాయి. గతంలో చంద్రబాబు బిసిల కోసం చాలా పథకాలే ప్రకటించేవాడు. అయితే ఆచరణలోకి వచ్చేటప్పటికీ పెద్దగా పట్టించుకోలేదన్న విషయం అందరూ చూసిందే.

ఎన్టీయార్ టిడిపి పెట్టినదగ్గర నుండి పార్టీని బాగా ఆధరించింది బిసిలే అన్న విషయం తెలిసిందే. అందుకే టిడిపి అంటేనే బిసిల పార్టీగా బాగా ముద్రపడిపోయింది. దానికి తగ్గట్లే బిసి సామాజికవర్గం కూడా టిడిపినే అంటి పెట్టుకుని ఉండేవారు. కానీ ఆ ముద్రంతా చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చింతర్వాత చెరిగిపోయింది. మరీ ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో దాదాపు రివర్సయిన విధానాన్ని అందరూ చూసిందే.

అదే సమయంలో జగన్ కూడా ఏలూరులో బిసి గర్జన పెట్టడం బిసి సామాజికవర్గానికి భరోసా ఇచ్చే విధంగా చర్యలు, హామీలు ఇవ్వటంతో వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. దాంతో మొదటిసారిగా బిసిల్లో చీలిక వచ్చి వైసిపి గురించి కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. దానికితోడు హామీ ఇచ్చినట్లే ఎన్నికలకు ముందు అవకాశం వచ్చిన ఎంఎల్సీ భర్తీలో బిసి నేత జంగా కృష్ణమూర్తికి కేటాయించటంలో జగన్ విషయంలో బిసిలకు నమ్మకం ఏర్పడటానికి మార్గం సుగమమైంది. దానికితోడు ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వివిధ బిసిల సంఘాల నేతలతో చాలా దురుసుగా ప్రవర్తించటం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఇక జగన్ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ఇద్దరు బిసి నేతలే కావటం ఓడిపోయినా మంత్రివర్గంలోకి తీసుకోవటంతో బిసిల్లో జగన్ పై నమ్మకం వచ్చింది. అలాగే రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో బిసి అభ్యర్ధిని నిలబెట్టింది జగన్ మాత్రమే. మామూలుగా టిడిపి కమ్మ సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కానీ జగన్ మాత్రం యువకుడు, సినీ హీరో అయిన మార్గాని భరత్ కు అవకాశం ఇచ్చి,గెలిపించుకున్నాడు.

అలాగే ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో కూడా సంప్రదాయంగా వస్తున్న రెడ్డి అభ్యర్ధి స్ధానంలో బొర్రా మదుసూధనయాదవ్ కు అవకాశం ఇచ్చాడు. ఇక కర్నూలు, అనంతపురం, హిందుపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బిసి అభ్యర్ధులనే పోటి చేయించాడు. పై రెండు జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లను వైసిపి స్వీప్ చేయటానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగానే చెప్పుకోవాలి. ఇటువంటి కారణాల వల్లే రాయలసీమలోని మొత్తం ఎనిమిదికి లోక్ సభ సీట్లకు ఎనిమిదింటినీ వైసిపినే గెలిచింది.

ఇటువంటి అనేక విషయాల వల్ల బిసిల వైఖరిలో స్పష్టమైన వైఖరి మొదలై మొన్నటి ఎన్నికల్లో కొన్ని వర్గాలు టిడిపిని కాదని వైసిపికి మద్దతుగా నిలిచాయి. దాని ఫలితంగానే టిడిపికి ఘోర ఓటమి. అయితే ఎన్నికల్లో గట్టెక్కగానే తెప్ప తగలేసే రకం కాదని జగన్ కూడా నిరూపించుకున్నాడు. అనేక పథకాల్లో బిసిలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. జరుగుతున్నది చూస్తుంటే భవిష్యత్తులో బిసిలు ఇక తెలుగుదేశంపార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం రాకపోవచ్చు.