iDreamPost
iDreamPost
ఇవాళ ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. పరిస్థితుల దృష్ట్యా ముందు ప్రకటించిన అక్టోబర్ 13 నుంచి సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పేశారు. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇవ్వలేదు. ట్రేడ్ సర్కిల్స్ లో ఫిలిం నగర్ వర్గాల్లో 2022 జనవరి 8న రిలీజ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో ఇప్పుడిలా అనౌన్స్ చేయడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సంక్రాంతి పోటీ నుంచి పక్కకు తప్పుకునే ఉద్దేశాలు లేవనే రీతిలో సంకేతాలు రావడంతో ఆ మేరకు జక్కన్న టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోనని ఆలోచనలో పడింది. కనీసం నవంబర్ దాకా ఏ సమాచారం ఆశించకపోవడమే మంచిది.
ఇలా జరగడంలో ఆశ్చర్యం లేదు. దేశవ్యాప్తంగా సిచువేషన్ ఏమంత బాలేదు. థియేటర్లు తెరుచుకున్నా కూడా నార్త్ లో వసూళ్లు మరీ భారీగా రావడం లేదు. ఏదో నెట్టుకొస్తున్నారు కానీ గుండెల మీద చెయ్యి వేసుకుని రిలీజ్ డేట్ ప్రకటించే ధైర్యం ఏ బాలీవుడ్ నిర్మాతకు లేదు. బెల్ బాటమ్ ఫలితం చూశాక వాళ్ళ ఉత్సాహం మరింత నీరు గారింది. మరోవైపు కేరళలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భయపడేంత తీవ్రంగా కాదు కానీ ఒక్కసారి పాకడం మొదలైతే కరోనాకు రోజులు అక్కర్లేదు గంటలు చాలు. గాలికన్నా వేగంగా ఈ వైరస్ పాకిపోతుంది. అందుకే ఇంకో నెల రెండు నెలలు హిందీ ప్రొడ్యూసర్లు వేచి చూడక తప్పేలా లేదు.
సో ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి ఇప్పట్లో ఏ నిర్ణయం తీసుకోలేరు. ఒక్క ఇండియాలోనే అయిదు వందల కోట్లకు పైగా బిజినెస్ టార్గెట్ పెట్టుకున్న ఈ మల్టీ స్టారర్ కు దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తెరుచుకుంటేనే సేఫ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తి స్థాయిలో సినిమా హాళ్లకు రావడానికి సంకోచిస్తున్న తరుణంలో వందల కోట్లతో ముడిపడిన చిత్రాలు రిస్క్ తీసుకోలేవు. ఇప్పటికైతే జనజీవనం సామాన్యంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్క థియేటర్ల వద్ద మాత్రమే భారీ సందడి కనిపించడం లేదు. ఒకవేళ నవంబర్ లోగా అంత సద్దుమణిగితే ఆర్ఆర్ఆర్ కు మోక్షం దక్కే ఛాన్స్ ఉంది. అభిమానులు దేవుణ్ణి వేడుకుంటున్నది అదే
Also Read : భూత్ పోలీస్ రిపోర్ట్