iDreamPost
android-app
ios-app

Janasena Party: జనసేన ఎన్నికల గుర్తు చేజారినట్టేనా?

  • Published Oct 14, 2021 | 6:24 AM Updated Updated Oct 14, 2021 | 6:24 AM
Janasena Party: జనసేన ఎన్నికల గుర్తు చేజారినట్టేనా?

pawan party symbol: రాష్ట్రంలో జనసేన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పార్టీ ప్రారంభించిన 2014 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అధికార బీజేపీతో గట్టి సంబంధాలే ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లో పరాజయం పొందారు.

ఈ ఎన్నికల్లో పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోలైన మొత్తం 3 కోట్ల 14 లక్షల ఓట్లలో జనసేన కేవలం 17 లక్షల 36 వేల ఓట్ల చిల్లర సాధించింది. అప్పటి ఎన్నికల్లో ఈ పార్టీకి కేటాయించిన “గ్లాసు” గుర్తు నిలుపుకోవాలంటే జనసేన కనీసం 8 శాతం ఓట్లు సాధించి ఉండాల్సింది. లేదా మొత్తం పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించి కనీసం ఇద్దరు సభ్యులను శాసనసభకు గెలిపించుకోవాల్సి ఉంది. 

అయితే 2019 ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏ నిబంధనను రీచ్ కాలేకపోయిన జనసేన ఎన్నికల అనంతరం తన ఎన్నికల గుర్తును కోల్పోయింది. అందువల్లే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన గుర్తును ఓ స్వతంత్ర అభ్యర్ధికి ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే అప్పట్లో బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా విజ్ఞప్తి చేయడం వల్ల అప్పుడు తాత్కాలికంగా గ్లాసు గుర్తు జాబితా నుండి తొలగించింది. 

ఇప్పుడు బద్వేల్ ఉపఎన్నికలో ఎన్నికల సంఘం మరోసారి గ్లాసు గుర్తును రిజిస్టర్డ్ పార్టీలకో, స్వతంత్ర అభ్యర్థులకో కేటాయించే అవకాశం లేకపోలేదు. 2019లో పోటీచేసిన జనసేన ఆ గ్లాసు గుర్తును రిజర్వు చేసుకునేందుకు కావాల్సిన శాతం ఓట్లు కానీ లేదా సీట్లు కానీ పొందలేకపోవడం వల్ల గ్లాసు చేజారిపోయింది. ప్రస్తుతం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గ్లాసు గుర్తు ఎవరైనా స్వతంత్ర అభ్యర్థికో, మరో పార్టీ అభ్యర్థికో కేటాయించిన పక్షంలో జనసేన ఓటర్లు బీజేపీ అభ్యర్ధికి కాక గ్లాసు గుర్తు పొందిన అభ్యర్ధికి ఓటేసే అవకాశం ఉంది. ఫలితంగా బీజేపీ ఓట్ల శాతం పడిపోవచ్చు. 

ఈ పరిస్థితుల్లో రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేయవలసి వస్తే గ్లాస్ గుర్తు నిలుస్తుందని ఇదమిద్దంగా చెప్పలేం. ఒకవేళ గ్లాసు గుర్తు పొందలేకపోతే జనసేన ఆ ఎన్నికల్లో మరో గుర్తుతో బరిలోకి దిగవలసి వస్తుంది. 
తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే (2019) ఎన్నిలకల్ గుర్తును రిజర్వు చేసుకునే అర్హత కోల్పోయిన జనసేన తిరిగి అదే గుర్తు పొందాలంటే గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. అప్పటికి అధికారంలో ఉండే బీజేపీ నాయకత్వం మాత్రమే జనసేనకు ఈ సదుపాయం కల్పించగలుగుతుంది.