iDreamPost
android-app
ios-app

ఇఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న పాత్రను పితాని ధృవీకరిస్తున్నాడా ? టిడిపిలో సంచలనం

  • Published Jun 19, 2020 | 3:55 AM Updated Updated Jun 19, 2020 | 3:55 AM
ఇఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న పాత్రను  పితాని ధృవీకరిస్తున్నాడా ? టిడిపిలో సంచలనం

’తాను మంత్రిగా ఉన్నపుడు ఇఎస్ఐలో ఎలాంటి అవినీతి జరగలేదు’ ఇది తాజాగా మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. మీడియాతో పితాని మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. ఇఎస్ఐలో కుంభకోణం జరిగిందా ? లేదా ? అనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఎందుకంటే ఐదేళ్ళల్లో జరిగిన సుమారు రూ. 900 కోట్ల కొనుగోళ్ళల్లో రూ. 157 కోట్లు అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ తేల్చింది. దాన్ని ఏసిబి దర్యాప్తు కూడా నిర్ధారించింది. పైగా కుంభకోణం జరగలేదని ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా అనటం లేదు.

అంటే ఇఎస్ఐ లో భారీ అవినీతి జరిగిందని అన్నీ రాజకీయ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. మరి జరిగిన అవినీతికి బాధ్యత ఎవరిది ? ఎవరిదంటే మంత్రిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడే అండ్ కో నే అన్న విషయం ఎవరినడిగినా చెబుతారు. ఎందుకంటే శాఖకు మంత్రిగా అచ్చెన్న ఉన్నపుడే అవినీతి జరిగింది కాబట్టి అందుకు కింజరాపే బాధ్యత వహించక తప్పదు. టిడిపి అధికారంలో ఉన్న చివరి ఏడాది మాత్రమే మంత్రిగా అచ్చెన్న స్ధానంలో పితాని సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ విషయాన్నే పితాని మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నపుడు అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. పైగా అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిస్తు జీవోను కూడా జారీ చేసినట్లు స్పష్టంగా చెప్పాడు. అంటే పితాని మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పటికే ఇఎస్ఐలో భారీ అవినీతి జరిగిందన్నది వాస్తవం. పైగా ఇఎస్ఐలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రిగా పితాని అనుకున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని కూడా తెలుస్తోంది. ఎందుకు చర్యలు తీసుకోలేదంటే అవినీతికి పాల్పడిన సూత్రధారి పాత్ర బయటపడుతుందన్న ఆలోచనతోనే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అర్ధమవుతోంది.

కారణం ఏదైనా తాజాగా పితాని చేసిన వ్యాఖ్యలు టిడిపిలో సంచలనంగా మారాయి. తన హయాంలో ఇఎస్ఐలో అవినీతి జరగలేదని పితాని అంటున్నాడంటే తనకన్నా ముందు మంత్రిగా చేసిన అచ్చెన్న హయాంలోనే అవినీతి జరిగినట్లు పితాని ధృవీకరిస్తున్నట్లే ఉంది. ఒకవైపు అచ్చెన్న అవినీతికి పాల్పడినట్లు పితాని అంగీకరిస్తుంటే చంద్రబాబు మాత్రం బిసి నేతపై వేధింపులంటూ రోడ్డెక్కి గోల చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా అవినీతి జరగలేదని అనటం లేదు. ఎంతసేపు జరిగిన అవినీతికి అధికారులదే పూర్తి బాధ్యతంటూ యాగీ చేస్తున్నాడు. అచ్చెన్నను వదిలిపెట్టేసి అధికారులపైన మాత్రమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటమే విచిత్రం.