iDreamPost
android-app
ios-app

చంద్రబాబును నమ్మి కన్నా రాజకీయమా ?

  • Published Apr 22, 2020 | 4:11 AM Updated Updated Apr 22, 2020 | 4:11 AM
చంద్రబాబును నమ్మి కన్నా రాజకీయమా ?

చంద్రబాబునాయుడును నమ్ముకుని బాగుపడిన వారు ఎవరని భూతద్దం పెట్టి వెదకాలి. చంద్రబాబుకు దూరమైన వాళ్ళో లేకపోతే టిడిపి నుండి బయటకు వచ్చేసిన నేతల్లో ఎవరినడిగినా ఇదే మాట చెబుతారు. ఎదుటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే చంద్రబాబు వాళ్ళని దగ్గరకు తీస్తాడు, బాగా ప్రోత్సహిస్తాడు. అవసరం తీరిపోయినా లేకపోతే ఉపయోగపడడని తేలిపోయినా అవతలి వాళ్ళ పరిస్ధితి అంతే సంగతులు.

ఇదంతా ఎవరి గురించంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురించే. చంద్రబాబు అంత కాకపోయినా కన్నాకు కూడా రాజకీయ అనుభవం బాగానే ఉంది. మరి అంత అనుభవం ఉన్న కన్నా ఎందుకు చంద్రబాబును ఫాలో అవుతుండటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కరోనా వైరస్ నేపధ్యంలో తాజాగా ధక్షిణి కొరియా నుండి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల లో అవినీతి జరిగిందని కన్నా ట్విట్టర్లో ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు అండ్ కో కు అంటే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే నిత్య కృత్యమైపోయింది. తాము చేసే ఆరోపణలను జనాలు పట్టించుకుంటారా లేదా అన్నది కూడా పసుపుదళం ఆలోచించే స్ధితిలో లేదు.

ఛత్తీస్ ఘడ్ తెప్పించిన కిట్లకన్నా ఏపి తెప్పించుకున్న కిట్ల ధర ఎక్కువ కాబట్టి అవినీతి జరిగిందన్నది టిడిపి ఆరోపణ. అదే ఆరోపణను కన్నా కూడా ముందు వెనక ఆలోచించకుండా చేసేశాడు. ఇక్కడ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు మరచిపోయిందేమంటే ఛత్తీస్ ఘడ్ తెప్పించుకున్న కిట్లతో పరీక్షల రిజల్టు రావటానికి 30 నిముషాలు పడుతుంది. అదే ఏపి తెప్పించిన కిట్లతో రిజల్టు పది నిముషాల్లో వచ్చేస్తుంది. అంటే కన్ఫిగరేషన్ మారిపోతే ధరలో తేడా వస్తుందన్న కనీస ఇంగితం కూడా ఆరోపణలు చేస్తున్న వారికి లేకపోయింది.

జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసిన చంద్రబాబుకు కొత్తగా పోయేదేమీ లేదు. కానీ కన్నా పరిస్ధితి అదికాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి తాను రాష్ట్ర అధ్యక్షుడన్న విషయాన్ని కన్నా మరచిపోయినట్లున్నాడు. ఛత్తీస్ ఘడ్ చెల్లించిన ధరతో పోలిస్తే ఏపి చెల్లించిన ధర ఎక్కువ కాబట్టి అవినీతి జరిగిందని కన్నా ఆరోపిస్తున్నాడు. మరి అదే నిజమైతే ఏపి చెల్లించిన ధరకన్నా కేంద్రం అవే కిట్లకు చెల్లించిన ధర కూడా ఎక్కువే. అంటే కన్నా లెక్క ప్రకారం కేంద్రం కూడా అవినీతికి పాల్పడినట్లే కదా ? మరి దాన్ని కన్నా అంగీకరిస్తాడా ?

ఇప్పటికే కన్నా వ్యవహారశైలి మీద పార్టీలోనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. జగన్ పై ఆరోపణలు చేయటంలో చంద్రబాబును కన్నా ఫాలో అవుతున్నాడంటూ కన్నా పై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయట. ఆ విషయం కన్నాకు తెలిసినా తన దారి మార్చుకోవటం లేదు. చూడబోతే చంద్రబాబును నమ్ముకున్నందుకు కన్నా తొందరలోనే ముణిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.