iDreamPost
iDreamPost
ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న ఇద్దరు మంత్రులకు పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ సీనియర్ నేతలిద్దరూ స్టేట్ నుంచి సెంటర్ రాజకీయాలకు మారుతుండడం విశేషంగా మారుతోంది. ఈ ఇద్దరు 1989 ఎన్నికల నుంచే తెరమీదకు వచ్చారు. అయితే అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ తూగో జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ వర్గీయుడిగా కొనసాగగా, అదే ఎన్నికల్లో నేదురుమల్లి అశీస్సులతో కుంచనపూడి టికెట్ దక్కించుకున్న మోపిదేవి ఓటమి పాలయ్యారు. 1994లో ఈ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1999లో మోపిదేవి విజయం సాధించగా, పిల్లి బోస్ మాత్రం పరాజయం పాలయ్యారు. 2004లో ఇద్దరూ ఒకేసారి గెలిచి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా మారారు.
ఇక ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ఈ ఇద్దరూ 2009లో విజయం సాధించగా 2014,2019 ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జగన్ వెన్నంటి ఉండడంతో ఆయన నమ్మకాన్ని చూరగొన్నారు. అందుకు అనుగుణంగా మండలిలో చోటు దక్కించుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమయినట్టు చెప్పవచ్చు. అయితే ఏపీలో శాసనమండలి రద్దవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరినీ ఒకేసారి పార్లమెంట్ లో ఎగువ సభకు పంపిస్తున్నట్టు కనిపిస్తోంది. శాసనమండలి రద్దు కోసం గత జనవరిలోనే ఏపీ అసెంబ్లీ తీర్మానించగా ప్రస్తుతం బాల్ కేంద్రం కోర్టులో ఉంది.
ఇటీవల ప్రధాని, అమిత్ షా తో జరిగిన భేటీలలో సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానికి అనుగుణంగా కేంద్రం పెద్దలు కూడా సముఖత వ్యక్తం చేసినట్టుగా కనిపించారు. ఆ నేపథ్యంలో బీజేపీ పెద్దల కోరిక మేరకు రిలయెన్స్ కార్పోరేట్ వ్యవహారాల చైర్మన్ నత్వానీకి కూడా జగన్ రాజ్యసభ టికెట్ కట్టబెట్టారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే పనిలో ఉన్న బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య అవగాహనలో భాగంగా ఏపీ శాసనమండలికి శాశ్వతంగా సెలవు చెప్పేందుకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నెలాఖరులో దానికి అనుగుణంగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదింపజేసే అవకాశం ఉందని ప్రచారం మొదలయ్యింది.
ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. మంత్రులకు ఇప్పటికే జగన్ టార్గెట్లు విధించారు. అదే సమయంలో మండలి కొనసాగించే అవకాశం ఉంటే రాబోయే సెషన్ వరకూ ఈ ఇద్దరు మంత్రులు కూడా క్యాబినెట్ లో కొనసాగడానికి ఆటంకాలు ఉండేవి కాదు. ఆ తర్వాత కూడా మరో ఆరు నెలల పాటు ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి పదవులకు ఢోకా లేదు. మండలి రద్దు జాప్యం అయ్యే అవకాశం ఉంటే వచ్చే ఏడాది వరకూ ఇరువురి పదవులకు పెద్ద ఆటంకం లేదు. అయినా అనూహ్యంగా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ , ఆశావాహులందరినీ పక్కన పెట్టి ఈ ఇద్దరు సీనియర్లను రాజ్యసభకు పంపించేందుకు జగన్ నిర్ణయించడానికి అసలు కారణం మండలికి ముగింపు అతి త్వరలో ఉండడమే అని చెబుతున్నారు. ఈనెలాఖరులో ఈ వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉండడంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా నెలాఖరుకి ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఏమయినా తాజా పరిణామాలతో ఏపీలో మండలి మూతపడే రోజు అతి త్వరలోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది.