iDreamPost
android-app
ios-app

బనగానపల్లి ‘బీసీ’ పయనం కూడా అటేనా..?

బనగానపల్లి ‘బీసీ’ పయనం కూడా అటేనా..?

కర్నూలు జిల్లాలో మినుకు మినుకు మంటున్న తెలుగుదేశం ఊపిరి పూర్తి స్థాయిలో ఆగిపోయే ప్రమాదం వస్తోందా? అంటే అవుననే అంటున్నారు ఆ జిల్లా నేతలు. 2019 ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలంతా ఇప్పటికే నిస్తేజంలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరు మాత్రమే అడపాదడపా తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ బీజేపీలో చేరిపోయారు. ఇటీవలే ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ టీడీపీకి రాజీనామా చేశారు. అదే బాటలోనే బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీలో చేరడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీలోని కీలక నేతతో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం.

వాస్తవానికి 2019 ఎన్నికల సందర్భంగానే ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు రెండు నెలలు ముందు ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయి చంద్రబాబును టెన్షన్‌ పెట్టారు. అయితే చంద్రబాబు ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో ఆయన పోటీకి దిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలో కాటసాని రామిరెడ్డి చేతిలో 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా, బీసీ జనార్ధనరెడ్డి 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డిపై 17వేల ఓట్లతేడాతో గెలిచారు. అంతకముందు రియల్ఎస్టేట్‌ వ్యాపారిగా, బిల్డర్‌గా ఉండేవారు. ఆయన తండ్రి పేరు మీద ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు చేసేవారు. మొదట్లో కాటసాని కుటుంబంతోనే ఉన్న ఆయన తర్వాత విభేదాలు రావడంతో టీడీపీలో చేరారు.

బనగానపల్లిలో టీడీపీ దుకాణం బంద్‌..
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా నియమించడానికి కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి బనగానపల్లి కూడా చేరనుంది. ఆ నియోజకవర్గంలో పేరు మోసిన నేతలంతా వైఎస్సార్‌సీపీలోకి ఎప్పుడో చేరిపోయారు. చల్లా రామకృష్ణారెడ్డి, ఎర్రబోతుల కుటుంబంతోపాటు పలువురు సీనియర్‌ నేతలంతా టీడీపీని వీడారు. వీరితోపాటు బీసీ జనార్ధనరెడ్డి కూడా పార్టీ వీడితే ఆ నియోజకవర్గంలో టీడీపీ మనుగడ సాధించడం కష్టమవుతుంది. దీనితో చంద్రబాబు డైరెక్ట్ గా రంగంలోకి దిగి బీసీ జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.