iDreamPost
android-app
ios-app

ఐపీఎల్ నిరవధిక వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన

ఐపీఎల్ నిరవధిక వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన

కరోనా రాక్షసి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తూ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది.ఐపీఎల్ వాయిదాపై ఈరోజు ఉదయమే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల యాజమాన్యాలకి సమాచారం అందజేసింది. ఐపీఎల్-2020 వాయిదాపై టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌కి కూడా బీసీసీఐ సమాచారం ఇచ్చింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29న ప్రారంభమై మే 24 వరకు జరగాల్సి వుంది.కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్రం విదేశీ వీసాలపై విధించిన ఆంక్షల కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనే అవకాశం లేకపోయింది.దీంతో తొలుత మార్చి 13న బీసీసీఐ ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కానీ బీసీసీఐ ఏదో విధంగా ఐపీఎల్-2020ను నిర్వహించాలని మార్చి చివరి వారం నుండి ఫ్రాంఛైజీలతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ప్రేక్షకుల్ని అనుమతించకుండా ఖాళీ మైదానాలలో ఆడడానికి ఫ్రాంచైజీలు అంగీకరించాయి.కానీ విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించకూడదని షరత్ విధించాయి.

ఐపీఎల్ రద్దు చేస్తే బీసీసీఐకి 3,269.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుంది.ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి టోర్నీ నిర్వహణకి ఉన్న అన్ని అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది.కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో ఆరు నెలల పాటు సెప్టెంబరు నెలాఖరు వరకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.

దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ రద్దు చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి.దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే బీసీసీఐకి సెప్టెంబర్-నవంబర్‌ల మధ్య మాత్రమే ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం దొరుకుతుంది.