తొలి వన్డేలో ఓపెనర్లుగా యువ ఆటగాళ్ల అరంగేట్రం….. సిరీస్ విజయమే భారత లక్ష్యం

న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను 5-0 తో వైట్ వాష్ చేసిన భారత్ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్‌లో భాగంగా బుధవారం కివీస్ తో తొలి వన్డే మ్యాచ్లో తలపడనున్నది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికపై భారత్,న్యూజిలాండ్‌ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది.భారత రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ గాయాలతో జట్టు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే.

వన్డేలలో పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ అరంగేట్రం:
సీనియర్ ఓపెనింగ్ జంట గైర్హాజరుతో టెస్టు క్రికెట్ లో సత్తా చాటిన యువ బ్యాట్స్ మెన్లు మయాంక్‌ అగర్వాల్‌,పృథ్వీషాలకు అదృష్టం వరించింది.దీంతో ఈ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ను పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ ప్రారంభించనున్నారు.భారత్‌ తరఫున ఇద్దరు ఓపెనర్లు ఒకేసారి అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో వీరిది నాలుగో జంట.1974లో ఇంగ్లాండ్‌పై సునీల్ గావస్కర్‌,సుధీర్‌ నాయక్‌ జంట,1976లో న్యూజిలాండ్‌పై పార్థసారథి శర్మ,దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ జంట,2016లో జింబాబ్వేపై కేఎల్‌ రాహుల్‌,కరుణ్‌ నాయర్‌ జంట ఇప్పటివరకు ఒకేసారి ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

బలమైన మిడిల్ ఆర్డర్ భారత్ సొంతం :
మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ,రెండవ స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌,మూడవ స్థానంలో మ‌నీశ్ పాండే బ్యాటింగ్ కు దిగ‌నున్నారు.అయితే 2019 నుండి కోహ్లీ వన్డేలలో 60 సగటుతో 1560 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌కు వ్యతిరేకంగా కోహ్లీ 23 ఇన్నింగ్స్‌లలో 65.15 సగటుతో 1303 పరుగులు సాధించాడుటీ20 సిరీస్‌లో పాండే నిలకడగా రాణించగా,శ్రేయ‌స్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.అయితే వ‌న్డే సిరీస్‌లో త‌న స్థాయికి తగ్గ ఆటతీరుతో భారీ ఇన్నింగ్స్ లు ఆడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగనున్నాడు.

ఎడమచేతి బౌలర్లకు స్వర్గధామము ‘హామిల్టన్’:

సెడాన్ పార్క్‌లో ఎడమచేతి పేసర్లు మరియు ఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్లు అత్యంత ప్రభావవంతంగా రాణిస్తున్నారు.మైదానం రికార్డు పరిశీలిస్తే ఎడమ చేతి స్పిన్నర్ రవీంద్ర జడేజా రాణించే అవకాశం ఉంది.ఇతర బౌలర్లు సెడాన్ పార్క్‌లో చాలా సాధారణ రికార్డును కలిగి ఉన్నారు.ఇరు జట్లలో ఒక్క లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కూడా లేడు.అయితే చివరి టీ20 లలో మునుపటి స్థాయిలో పదునైన యార్కర్ లు సంధించిన జస్‌ప్రీత్ బుమ్రా,నాలుగో టి-20లో చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి స్కోర్లు సమానం చేసిన మహ్మద్ షమీ,నిలకడగా 140-150 కి.మీ వేగంతో బంతులు వేయగల నవదీప్ సైని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తుంది.

వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ కు షాక్:
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా టీ20 సిరీస్‌లో భారత్ చేతిలో వైట్ వాష్ గురైన న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కు ముందు ఎదురు దెబ్బ తగిలింది.టీమిండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడ్డ కివీస్ కెప్టెన్ విలియమ్‌సన్ తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదు.అతని ఎక్స్-రే రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు విశ్రాంతి తీసుకుంటే గాయం నుంచి త్వరగా కోలుకోవచ్చని సూచించడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ విలియమ్సన్ కు రెస్ట్ ఇచ్చింది.రెండు వన్డేలకు కివీస్ జట్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనుండగా విలియమ్‌సన్ స్థానములో మార్క్ చాప్‌మెన్ ఆడనున్నట్లు కివీస్ బోర్డు పేర్కొంది.భార‌త్‌-ఎ తో సిరీస్‌లో రాణించిన జేమ్స్ నీష‌మ్ జట్టులోకి రావడం కివీస్కు శుభపరిణామం.కాగా మార్టిన్ గ‌ప్తిల్‌, హెన్రీ నికోల్స్ ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగుతారు.

విలియ‌మ్స‌న్ కూడా దూరం కావ‌డంతో రాస్ టేల‌ర్‌పై కివీస్ బ్యాటింగ్ వెన్నుముక కానున్నాడు.అత‌ను ఈ సిరీస్‌లో రాణించాల‌ని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆల్‌రౌండ‌ర్లు కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌,మిషెల్ సాంట్న‌ర్‌లు భారీ స్కోరు లతో ఆదుకోవాలని,సొంతగడ్డపై బౌల‌ర్లు కూడా స‌త్తాచాటాల‌ని న్యూజిలాండ్ ఆశిస్తోంది.

హామిల్ట‌న్ మైదానం గత రికార్డు:
పిచ్‌కు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ మైదానం పై జట్ల సగటు స్కోరు 262 ప‌రుగులు మాత్రమే.ఈ మైదానంలో జరిగిన 32 వన్డే మ్యాచ్లలో రెండోసారి లక్ష్య ఛేదన చేసిన జ‌ట్లు 21 సార్లు విజయం సాధించాయి.కాబట్టి టాస్ నెగ్గిన జ‌ట్టు ఛేద‌నవైపు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. బుధ‌వారం వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మ్యాచ్‌కు ఇబ్బందేమీ లేద‌ని వాతావరణ శాఖ తెలియజేసింది.మ్యాచ్ ఉద‌యం7.30 గంట‌ల నుంచి ప్రారంభమవుతుంది.

Show comments