ఫీజుతో సంబంధం లేకుండా పిల్లలను చేర్చుకోండి -జగన్

  • Published - 07:10 AM, Thu - 7 May 20
ఫీజుతో సంబంధం లేకుండా పిల్లలను చేర్చుకోండి -జగన్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఎటువంటి ట్యూషన్‌ ఫీజులు తీసుకోకుండా ప్రవేశాలు కల్పించాలని సీఎం జగన్‌ ప్రైవేటు కళాశాలలను ఆదేశించారు. ప్రతి త్రైమాసికానికీ ఒకసారి సంబంధిత ఫీజును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోనే వేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుండే ఈ పద్ధతి అమలవుతుందని జగన్ తెలిపారు. ప్రతి త్రైమాసికానికీ ఒకసారి తల్లులు కాలేజీలకు వచ్చి తమ పిల్లల చదువు తీరు, ఫలితాల గురించి ఆరా తీస్తారని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీల మేనేజ్‌మెంట్లకు బుధవారం లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టో-నవరత్నాల్లో వాగ్దానం చేసినట్టు గా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలు రూ.1880 కోట్లతోపాటు 2019-20 బకాయిలతో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లను కాలేజీలకు చెల్లించామని సీఏం తెలిపారు

ఒకే విద్యా సంవత్సరంలో 4 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నూతన విధానం ప్రకారం 2020-21 మొదటి త్రైమాసికం నుంచి ఆధార్‌ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాలకు ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమవుతుంది. తల్లులు ప్రభుత్వం నుంచి తీసుకున్న తర్వాత త్రైమాసిక ఫీజును కాలేజీలకు చెల్లించాలి. తద్వారా తల్లులు సంవత్సరంలో కనీసం 4 సార్లు కళాశాలలను సందర్శించి పురోగతిని పర్యవేక్షించవచ్చు.

ఈ విధ్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రతి త్రైమాసికంలో ట్యూషన్‌ ఫీజును విడుదల చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందరం కలిసి పనిచేద్దామని ప్రైవేట్ కళాశాలకు సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారు.

Show comments