తొలి టెస్టులో విఫలమైన తరువాత ఏడ్చేశా:సచిన్

శుక్రవారం 47వ పుట్టినరోజు జరుపుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ అనుభవం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు.కనీసం ఒక రంజీ మ్యాచ్ కూడా ఆడకుండా పదహారేళ్ల నూనూగు మీసాల సచిన్ పాక్ గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.1989 నవంబర్ 15న కరాచీ మైదానంలో మొదలైన ఆ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన సచిన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 24 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు కొట్టి కేవలం 15 పరుగులు చేసి ఔటైపోయాడు.అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని సచిన్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ అగ్రశ్రేణి బౌలర్ల బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఇబ్బంది పడినట్లు తెలిపాడు.వఖార్ యూనిస్ బౌలింగ్‌లో బంతిని సరిగా అంచనా వేయడంలో విఫలమై సచిన్ బౌల్డయ్యాడు.

సచిన్ తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ “నేను పాఠశాల క్రికెట్ మ్యాచ్‌ల తర్వాత నేరుగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అడుగెట్టాను.కానీ అరంగేట్ర టెస్టులో బ్యాటింగ్ ఎలా చెయ్యాలో తొలుత నాకు అర్థం కాక గందరగోళానికి గురి అయ్యాను.పాక్ ఫాస్ట్ బౌలర్లు వసీమ్ అక్రమ్, వఖార్ యూనిస్ చాలా వేగముతో షార్ట్ పిచ్ బంతులను సంధించి నాకు పరీక్ష పెట్టారు.అప్పటి వరకూ ఆ స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం లేకపోవడంతో ఇబ్బందిపడ్డాను.కొన్నిసార్లు వారి పేస్,బౌన్స్ కారణంగా కనీసం బంతిని బ్యాట్‌కు తగిలించడం కూడా సాధ్యపడలేదు.చివరికి ఆ టెస్ట్ మ్యాచ్‌లో 15 పరుగుల వద్ద ఔటయ్యాను. దాంతో నాకు చాలా బాధ కలిగింది. డ్రెస్సింగ్ రూముకి చేరిన వెంటనే బాత్‌రూములో కూర్చుని ఏడ్చేశా.అదే నా తొలి,చివరి మ్యాచేమో అనిపించింది’ అని వెల్లడించాడు.

ఇక తన అరంగేట్ర టెస్ట్ ముగిసిన తర్వాత అప్పటి తన సహచరుడు,ప్రస్తుత భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి తనకు విలువైన సలహా ఇచ్చాడని సచిన్ తెలియజేశాడు.పాఠశాల క్రికెట్ తరహాలోనే బ్యాటింగ్ చేయాలని,కనీసం అరగంట లేదా గంట సమయం క్రీజులో నిలబడ్డ గలిగితే పాక్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కోవచ్చని రవిశాస్త్రి సూచించినట్లు సచిన్ పేర్కొన్నాడు.దీంతో రెండో టెస్టులో ఎక్కువ సమయం క్రీజులో నిలిచిన సచిన్ టెండూల్కర్ 172 బంతులను ఎదుర్కొని 59 పరుగులు చేశాడు.తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ ఏకంగా 200 టెస్టులు ఆడి 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు.329 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ బరిలో దిగిన సచిన్ 51 సెంచరీలు,68 అర్థ సెంచరీలు సాధించాడు.

Show comments