వై.యస్.ఆర్ టెలీ మెడిసిన్ కు అపూర్వ స్పందన

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయిన వేళ సరైన ప్రజా రవాణ సదుపాయం సరైన ఒ.పి సేవలు లేక అనేక మంది రోగులు పడుతున్న ఇక్కట్లు గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ డాక్టర్ వై.యస్.ఆర్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 8 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దిన ఈ కార్యక్రమానికి 14410 టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించిన విషయం తెలిసినదే. ఈ నెల 13న ఈ కార్యక్రమం అమలులోకి వచ్చే నాటికే ప్రజలకు టెలీమెడిసిన్ ద్వారా స్వచ్చందంగా సేవలందించేందుకు 286 మంది వైద్యులు తమ పేర్లని నమోదు చెసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ టెలీ మెడిసిన్ పనితీరుని మొత్తం మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో 14410 టోల్ ఫ్రీ నెంబర్ కు రోగి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. టెలీ మెడీసిన్ సిస్టం లో నమోదైన మొబైల్ నెంబర్ ఆదారంగా ఎగ్జిక్యూటివ్స్ రోగికి కాల్ చేసి వారు ఉంటున్న ప్రదేశాన్ని , వయస్సును, వారు ఎదుర్కుంటున్న రోగ లక్షణాలని తెలుసుకుని వారికి ఒక గుర్తింపు నెంబర్ ఇస్తారు. ఇంక రెండవ దశలో రోగి పూర్తి వివరాలు టెలీ మెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికి కనిపిస్తాయి. దాని ఆధారంగా డాక్టర్ల బృందంలో ఒకరు కాల్ ని స్వీకరించి ఒ.పీ సేవలు అందిస్తారు, రోగికి నిర్వహించవలసిన పరీక్షలు అందించాల్సిన మందులను తెలియ చేస్తారు. వ్యాది లక్షణాలను బట్టి కరోనా వైరస్ అనుమానితులా కాదా అనేది కూడా గుర్తించి. ఎస్.ఎం.ఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి, అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఇక మూడవ దశలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య అధికారులకి రోగి ప్రిస్కిప్షన్ పంపి అవసరమైన ఔషదాలను ప్రత్యకంగా ప్యాక్ చేసి ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.

సామాన్య ప్రజానీకానికి వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రారంబించిన ఈ టెలీ మెడిసిన్ కు వారం రోజుల వ్యవదిలోనే ప్రజలనుండి అపూర్వ స్పందన లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఏర్పాటు చేసిన వారం రోజుల వ్యవధిలోనే 8243 మంది కాల్ చేయగా అందులో డాక్టర్లు తిరిగి 4732 మందికి సేవలు అందించినట్టు, 3491 మందికి తిరిగి డాక్టర్లు ఫోన్ చేయగా తిరిగి స్పందించనట్టు తెలుస్తుంది. మిస్డ్ కాల్ ఇస్తే ముంగిట్లో వైద్య సేవలు అందేలా తీర్చిదిద్దిన టెలీ మెడిసిన్ వ్యవస్త ఈ కష్టకాలంలో ప్రజల ఆరోగ్య సమస్యలను తీరుస్తూ సంజీవినిలా పనిచేస్తుందని పలువురు కితాబు ఇస్తున్నారు . సరైన సమయంలో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం ఎంతైనా హర్షణీయం…

Show comments