Theatres : ఇలా అయితే థియేటర్లకు ఉత్సాహం వచ్చేదెప్పుడు

సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మాత్రం ఏమంత కిక్ లేదు. రీజనబుల్ బడ్జెట్ లో తీసి మంచి రేట్లకే అమ్మిన చిత్రాలు కూడా కనీసం పెట్టుబడిని కూడా ఇవ్వలేనంత వీక్ గా రన్ అవుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. మొన్న శుక్రవారం వచ్చిన వసూళ్లే దీనికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. రాజా విక్రమార్క మొదటి రోజు సుమారుగా 60 లక్షల పైచిలుకు షేర్ కు పరిమితం కాగా పుష్పక విమానం కష్టం మీద 40 లక్షలు దాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కోటిన్నర లోపే బిజినెస్ చేసుకున్న కురుప్ అనూహ్యంగా 30 లక్షలను దాటిందని ట్రేడ్ రిపోర్ట్. ఇవేవి ఆశాజనకమైన కలెక్షన్లు లేవు.

దేనికీ యునానిమస్ గా మినిమం హిట్ టాక్ రాకపోవడం ఈ పరిస్థితికి కారణం. అంతంత మాత్రంగా ఉండే కంటెంట్ ని మేము థియేటర్లలో చూడమని ప్రేక్షకులు స్పష్టంగా తీర్పులిస్తున్నా సరే మన దర్శక రచయితల ఆలోచనా ధోరణి మాత్రం మారడం లేదు. కొన్నిసార్లు మరీ సిల్లీ అనిపించే కథాకథనాలతో నిర్మాతలకు నష్టాలు మిగులుస్తున్నారు. ఓటిటిల వాడకం పెరిగాక ఆడియన్స్ ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ అయినా దానికి తగ్గట్టు టికెట్ రేట్లు మారడం లేదు. ఒకటే ఉంటున్నాయి. అలాంటప్పుడు మీడియం రేంజ్ చిత్రాలను పెద్ద తెరమీద చూడాలంటే అంతే బలమైన కంటెంట్ ఉండాలి.

వాస్తవంగా చూస్తే అలా జరగడం లేదు. అందుకే టికెట్ కౌంటర్లు వీక్ డేస్ లో డీలాగా ఉంటున్నాయి. ముందువారం వచ్చిన పెద్దన్న, ఎనిమి, మంచి రోజులు వచ్చాయి కూడా నష్టాలు తెచ్చినవే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత జనాలు సందడిగా కనిపించిన సినిమా రాలేదు. పదుల కోట్లలో మార్కెట్ ఉన్న స్టార్ హీరోలెవరు లాక్ డౌన్ తర్వాత తమ సినిమాలు రిలీజ్ చేయలేదు. డిసెంబర్ 2న అఖండ వచ్చాకే పెరుగుదల చూడొచ్చేమో. అది కూడా అధికారిక డేట్ ప్రకటించలేదు. ఇవాళ సాయంత్రం ట్రైలర్ తో పాటు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇంకో పదిహేను రోజులు ఆగి డిసెంబర్ మొదలైతే తప్ప అసలైన జోష్ వచ్చేలా లేదు

Also Read : Mega 154 : ఇద్దరిలో అన్నయ్య తోడు ఎవరు

Show comments