iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ సమయంలోనూ కొనసాగిన సంక్షేమం, ఇవన్నీ జగన్ కి ఎలా సాధ్యం?

  • Published May 06, 2020 | 3:20 AM Updated Updated May 06, 2020 | 3:20 AM
లాక్ డౌన్ సమయంలోనూ కొనసాగిన సంక్షేమం, ఇవన్నీ జగన్ కి ఎలా సాధ్యం?

 కరోనా వైరస్ అన్ని వ్యవస్థలను దెబ్బతీసింది. సర్వం చిక్కులు ఎదుర్కొంటోంది. సర్కారు నుంచి సామాన్యుడు వరకూ ఎవరూ మినహాయింపు కాదు. అయినా ఇంతటి విపత్తు సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. పైగా ఎన్నికల హామీలో భాగంగా కొత్త పథకాలను ముందుకు తీసుకొచ్చింది. ఖజానా సహకరించకపోయినా కష్టకాలంలో ప్రజలు ఆదుకునే పెద్ద మనసుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కానీ ఆదాయం పూర్తిగా పడిపోయిన తరుణంలో ప్రభుత్వానికి ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్న పలువురిలో ఉదయిస్తోంది. ప్రతిపక్షాలకు ఈ పరిణామాలు మింగుడుపడకపోగా, అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం మూడుసార్లు పేదలకు ఉచితంగా రేషన్, పప్పులు అందించింది. సమీప తెలంగాణాలో ఇప్పటి వరకూ ఏప్రిల్ రేషన్ మాత్రమే అందించారు. కరోనా సహాయం కింద ఏపీలో ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున రూ.1300 కోట్లు పంపిణీ చేశారు. తెలంగాణాలో బ్యాంకు , పోస్టాఫీస్ అకౌంట్లలో వేసిన సొమ్ము ఇప్పటి వరకూ సామాన్యులు చాలామందికి చేరలేదు. గత రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నాడే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేశారు. రూ.2800 కోట్ల నిధులు దానికి వెచ్చించారు.

వాటితో పాటుగా జగనన్న విద్యాదీవెన పథకం పేరుతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన నిధులను కూడా కలిపి విడుదల చేశారు. ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఒకే సారి రూ. 4000 కోట్లను బదిలీ చేశారు. ఆ వెంటనే డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ హయంలో ప్రారంభించి, చంద్రబాబు నిలిపివేసిన సున్నా వడ్డీ పథకం మళ్లీ ప్రారంభించారు. దానికి రూ. 1400 కోట్లు విడుదల చేసి లబ్దిదారులకు అందించారు. అందుకు తోడుగా గత ఏడాది కాలంలో విపత్తుల మూలంగా నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విడుదల చేశారు. దానికోసం రూ.55 కోట్లు విడుదల చేశారు. ఇక వివిధ పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, మార్కెటింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.

కరోనా సమయంలో ఆదుకోవడం కోసమంటూ పూజారుల, ఇమాంమ్ లు, ఫాదర్లకు సహాయం పంపిణీ చేశారు. తాజాగా మత్స్యకారులకు 1.02లక్షల కుటుంబాలకు ఒకేసారి వేట నిషేధ పరిహారం చెల్లిస్తున్నారు. గతంలో రూ.4వేల ఉన్నదానిని జగన్ ఒకేసారి రూ.10వేలు చేశారు. అంతేగాకుండా జూన్ తర్వాత రెండు మూడు నెలలకు గానూ పరిహారం అందించని పరిస్థితి నుంచి ఇప్పుడు మే మొదటి వారంలోనే వాటిని అందించడానికి పూనుకున్నారు.

వాటితో పాటుగా అభివృద్ధి పథకాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పునరావసం, ఇతర కార్యక్రమాలకు రూ. 1960 కోట్లు విడుదల చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. కరోనా నివారణ కార్యక్రమాల్లో భాగంగా అదనంగా వైద్యుల నియామకం, నర్సులకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు పూనుకున్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇరువైపులా సాగిస్తున్న జగన్ ప్రభుత్వం టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కుల తయారీ వంటి వాటి కోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తోంది. వలస కూలీల వసతి, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, రెడ్ జోన్లలో పేదలకు సహాయం అందజేత వంటి వాటికి కూడా పూనుకున్నారు.

ఆదాయం నిల్లు- పంపిణీ ఫుల్లు

ఓవైపు లాక్ డౌన్ తో ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఒక్క ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వానికి రూ. 16వేల కోట్ల ఆదాయం రావాల్సిన సమయంలో అది రూ. 3 వేల కోట్లు కూడా లేదు. దాంతో చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా చెల్లించాల్సిన వేతనాల్లో రూ.6500 కోట్లను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రతినిధులు , ఉన్నత స్థాయి అధికారులకు భారీగా కోత కోసి, పెన్షనర్లు, అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించడానికి సిద్ధపడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖర్చు రూ. 2వేల కోట్ల మిగిలినట్టు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహాయం అందడం లేదు. కేసీఆర్ చెప్పినట్టు రాష్ట్రాలను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించకపోవడంతో సొంతంగా ఆదాయం సమకూర్చుకునేపనిలో పడ్డారు.

దానికి తగ్గట్టుగానే రూ. 7వేల కోట్లను ఈ బడ్జెట్ సంవత్సరంలోనే అప్పులు చేయాల్సి వచ్చింది. దానికి తోడుగా అనవసర ప్రచారం, ఇతర ఖర్చులను భారీగా మిగిల్చారు. వృధా వ్యయం లేకపోవడంతో నేరుగా ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించే అవకాశం కలుగుతోంది. సీఎం కూడా ప్రచార ఆర్భాటాలకు పూనుకుండా, కేవలం పని పూర్తి కావాలనే లక్ష్యంతో ఉండడంతో ప్రజలకు మరింత మేలు చేసేందుకు నిధులు సమకూరుతున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా కష్టకాలంలో కూడా అనేక సమస్యల మధ్య అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విడవకుండా ప్రభుత్వం చేపట్టడం విశేషంగా కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో ఇది పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు ఆర్థిక వేత్తలకు ప్రజల వద్దకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహాయం అందించడం ద్వారా కొనుగోలు శక్తిపెంచే ప్రయత్నం అత్యవసరం అని చెబుతున్న తరుణంలో జగన్ చర్యలు మార్కెట్ ని కాపాడేందుకు దోహదపడతాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.