iDreamPost
iDreamPost
మన దగ్గర సీక్వెల్ సెంటిమెంట్ ఒక్క బాహుబలి విషయంలో తప్ప అంతగా వర్కౌట్ కాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ధూమ్, రేస్ లాంటివి రెండో భాగాలు కూడా అద్భుత విజయాలు దక్కించుకున్నాయి. అదే కోవలో 16 ఏళ్ళ తర్వాత ఒక హిందీ సూపర్ హిట్ సీక్వెల్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2005లో రిలీజైన బంటీ ఔర్ బబ్లీకి ఇది కొనసాగింపు. అప్పట్లో అభిషేక్ బచ్చన్-రాణి ముఖర్జీ కాంబినేషన్ తో పాటు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ లు కూడా భాగం పంచుకున్న కజరారే కజరారే పాట ఎప్పటికీ మర్చిపోలేని చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది. మరి ఇంత అంచనాలతో వచ్చిన ఈ పార్ట్ 2 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈసారి హీరో మారాడు. అభిషేక్ స్థానంలో సైఫ్ అలీ ఖాన్ ని తీసుకొచ్చారు. రాణి ముఖర్జీని కంటిన్యూ చేశారు. వీళిద్దరితోనే రన్ చేయడం కష్టం కాబట్టి సిద్ధాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్ ల కొత్త జంటను సెట్ చేశారు నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా దర్శకుడు వరుణ్ వి శర్మ కథను రాసుకున్నప్పటికీ తెరమీద పండాల్సిన కనీస స్థాయిలో కామెడీ లేకపోవడంతో సినిమా మొదలైన అరగంటకే ఒంట్లో ఓపికకు ఐఏఎస్ ఎగ్జామ్ మొదలవుతుంది సరే ఎలాగోలా తట్టుకుని ఇంటర్వెల్ దాకా భరించినా అసలు నరకం రెండో సగంలో చూపించాడు. ఏ ఒక్కటి సరైన రీతిలో క్యారెక్టరైజేషన్ చేసుకోకపోవడంతో అంతా గందరగోళం చిందరమేళంలా తయారయ్యింది.
నిజానికి పాత బంటీ ఔర్ బబ్లీ కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ కాదు. కాకపోతే ఆ టైంలో అందులో ఎంటర్ టైన్మెంట్, కిక్కిచ్చే పాటలు దాన్ని సక్సెస్ చేశాయి. ఇన్నేళ్లు గడిచాక ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చిన విషయాన్ని గమనించకుండా పాత చింతకాయపచ్చడితో వడ్డించిన ఈ చప్పిడి భోజనం థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా చాలా సేపు వెంటాడుతూనే ఉంటుంది. రైటింగ్ లో నీరసం వల్ల సైఫ్ రాణి లాంటి సీనియర్లు కూడా నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇక సాంకేతిక విభాగాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. రెండు వారాల క్రితం వచ్చి 150 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న సూర్యవంశీ ఇచ్చిన కిక్ ఈ బంటీ ఔర్ బబ్లీ 2 పూర్తిగా నీరుగార్చేసింది
Also Read : Missing Movie : మిస్సింగ్ సినిమా రిపోర్ట్