Idream media
Idream media
ఈనాడు బాధ్యతల నుంచి అధికారికంగా రామోజీరావు తప్పుకోవచ్చు కానీ ఈనాడు అంటే రామోజీ, రామోజీ అంటే ఈనాడు. అది రాసిన సత్యాసత్యాల గురించి పక్కన పెడితే ఈనాడు అంటే చరిత్ర. ఇంకా నడుస్తున్న చరిత్ర. సద్ది వార్తలతో మధ్యాహ్నం వేళ పాఠకులను చేరే ఆంధ్రప్రభ, పత్రికలని , జర్నలిజం నుంచి తోసేసి, జర్నలిజాన్నే తనవైపు మళ్లించుకుంది ఈనాడు.
1976లో మొదటిసారి ఈనాడుని చూశాను. అనంతపురం లైబ్రరీకి సాయంత్రం వేళ చేరేది. అడాలిసెంట్ వయస్సులో సెక్స్ సైన్స్‌ని దొంగగా చదవడం అదో ముచ్చట. 1983లో తిరుపతి ఎడిషన్ ప్రారంభమయ్యే వరకు ఈనాడు అందుబాటులో ఉండేది కాదు. ఆ తర్వాత తెల్లారేసరికి ఇంటిముందర పేపర్ ఉండేది.
1984లో ఎన్టీఆర్‌ని కూలదోసినపుడు అనంతపురం రణరంగమైంది. పోలీస్ కాల్పుల్లో జనం చనిపోయారు. లూఠీలు జరిగాయి. పట్టణంలో అనధికారిక కర్ఫ్యూ. ఎక్కడ చూసినా రోడ్డుకి అడ్డంగా కాల్చిన టైర్లు, రాళ్లు. సీఆర్పీఎఫ్ దిగింది. పోలీస్ సైరన్ శబ్దాలు, మనుషులు కనిపిస్తే చితకబాదేవాళ్లు. ఈ సంక్షోభంలో కూడా ఈనాడు పేపర్ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది.
ఇది తెలిసి కుర్రాళ్లు కొందరం సందుల్లో నక్కినక్కి టవర్‌క్లాక్ దగ్గరికి వెళ్లాం. మమ్మల్ని చూసి పోలీసులు వెంటపడ్డారు. కమలానగర్‌లో ఉన్న అనేక గల్లీలు మాకు తెలిసినట్టు వాళ్లకి తెలియదు కాబట్టి తప్పించుకున్నాం. చివరికి బ్లాక్‌లో ఒక రూపాయి పెట్టి కొనుక్కున్నాం. ( ఆ రోజుల్లో పేపర్ అర్ధరూపాయ్)
నేను జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకోడానికి ఈనాడు, ఎన్‌కౌంటర్ పత్రికలే కారణాలు. మర్యాదస్తుల భాషలో ఈనాడు, ముతక భాషలో ఎన్‌కౌంటర్ రాజకీయ నాయకులని చీల్చి చెండాడేవి.
ఎన్‌కౌంటర్ పత్రిక రెండు రూపాయలు. ఆ రోజుల్లో వీక్లీ ఖరీదు 75 పైసలు. కానీ ఎప్పుడు వచ్చినా ఎన్‌కౌంటర్ కాపీలు దొరికేవి కావు. పింగలి దశరథరామ్ పంథా కరెక్ట్ కాకపోయినా భాషలో చమత్కారం, వెటకారం కావల్సినంత ఉండేవి.
అదే విధంగా ఈనాడులో హేమాహేమీలు పనిచేయడం వల్ల భాష కొత్త పుంతలు తొక్కేది. ఎంఏ (తెలుగు) ఫస్ట్ క్లాస్‌లో పాసైన తర్వాత ఎంఫిల్ చేసి లెక్చరర్ అవకుండా, జర్నలిస్టునయ్యాను. 1986లో ఈనాడుకి అప్లికేషన్ పెడితే టెస్ట్‌కి కాల్ లెటర్ రాలేదు. ( నా అప్లికేషన్ పోస్టల్ వాళ్లు మిస్ చేశారని ఇప్పటికీ నమ్ముతాను)
ఆ తర్వాత ఈనాడులో స్వేచ్ఛ ఉండదని, రామోజీరావు పిండుతాడని కొందరు భయపెడితే మళ్లీ ఎప్పుడూ అప్లై చేయలేదు. లెఫ్ట్ భావజాలం నెత్తికెక్కడం వల్ల స్వేచ్ఛని కోరుకున్నాను.
1988లో ఆంధ్రజ్యోతిలో చేరాను. 99లో ఆంధ్రజ్యోతి మూసినప్పుడు తెలిసింది నేను చేసింది జీవిత కాలపు తప్పిదమని. స్వేచ్ఛని పోగొట్టుకున్నందుకు ఈనాడులో ఎంతోకొంత మంచి జీతాలు లభించేవి. ఆంధ్రజ్యోతి రోడ్డున పడేసింది.
నేను చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్‌గా పనిచేసినంత కాలం ( 10 సంవత్సరాలు) ఈనాడుని దాటడం ( న్యూస్, సర్క్యులేషన్) నా వల్ల కాలేదు. అది సాక్షితో నెరవేరింది. 2008 సాక్షి ప్రారంభం నుంచి నేను రిజైన్ చేసే వరకు (2014) ఈనాడు వెనకపడే ఉండేది. దీనికి కారణం సాక్షి కొత్తగా ఉండడం, రేటు తక్కువ, రాజశేఖరరెడ్డి మీద అభిమానం, ఏమైతేనేం ఈనాడు తొలిసారిగా జిల్లాలో పరాజయం చూసింది.
ఆ తర్వాత సాక్షి పాంప్లెట్‌గా మారిపోవడం, వృత్తి నైపుణ్యాలు లేనివాళ్లంతా పెద్ద కుర్చీల్లో కూర్చోవడం, తెలుగు రాని వాళ్లు సీఈఓలు కావడం…కారణం ఏదైతేనేం సాక్షి తన గొయ్యి తాను తవ్వుకుంది. స్వయంగా సిమెంట్ ఇటుకలతో హార్డిల్స్ నిర్మించుకుని వాటిని దాటలేక పల్టీలు కొట్టడం సాక్షి విశేష ప్రత్యేకత. ఇక ఇప్పట్లో ఈనాడుని దాటలేదు. పత్రికంటే మొదట మేధో యుద్ధం, తర్వాతే వ్యాపార యుద్ధం. మేధో యుద్ధాన్ని మరిచిపోయింది సాక్షి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జగన్ ఓదార్పుయాత్ర చేస్తున్నప్పుడు నేను రీజనల్ ఇన్‌చార్జ్‌ని. నెల్లూరు ఎడిషన్‌ని చూడాల్సి వచ్చింది. రాత్రి రెండు గంటల వరకు యాత్ర జరిగింది. ఆయన ఫొటోల కవరేజి కోసం ఎడిషన్ ఆలస్యమైంది. నెల్లూరు మేనేజర్ స్వయంగా పేపర్ తీసుకుని కారులో ఉదయగిరి వెళ్లాడు. ఉదయం 5.30 గంటల సమయం. జగన్ శారీరకంగా ఎంత బలవంతుడంటే రాత్రి 2.30 గంటలకి నిద్రపోయిన వ్యక్తి ఐదు గంటలకే లేచి రెడీ అవుతాడని ఎలా ఊహిస్తారు? మేనేజర్ వెళ్లే సరికి ఆయన ముందు ఈనాడు ఉంది. సాక్షి మేనేజర్‌ని కోపంగా చూసి “ఈనాడు కంటే ఆలస్యంగా రావడానికి కాదు నేను కోట్లు ఖర్చు పెట్టి సాక్షి పత్రిక పెట్టింది” అని అన్నాడట.
ఒక దశలో సాక్షి నెంబర్ వన్ కావాల్సి ఉంది. కానీ గెలవడానికి అవసరమైతే ఈనాడు దొంగదారుల్ని కూడా ఎంచుకోగలదు. ఇష్టమోచ్చినట్టు సర్క్యులేషన్ డంప్ చేసి గెలిచింది.
ఇక సాక్షి ఎప్పటికీ గెలవదు. అది పరుగెత్తడం మానేసి చాలా కాలమైంది. ఈనాడులో రామోజీరావు మాత్రమే పిండి, ఉతికి ఆరేస్తాడు. సాక్షిలో ఎప్పుడు ఎవరొచ్చి ఉతుకుతారో తెలియదు. ఒకరొచ్చి సున్నం, చౌడు వేసి ఉడకబెట్టి బండకు కొట్టి ఉతుకుతారు. ఇంకొకరు శాంసంగ్ వాషింగ్ మిషన్‌లో పతంజలి పౌడర్ వేసి ఉతుకుతారు. ఒకరొచ్చి మరక మంచిదంటారు. ఇంకొకరు వచ్చి రంగు వెలిసినా ఫర్వాలేదు, మరక పోవాల్సిందే అంటారు. ఒక్కోసారి తెలుగు రానివాళ్లు, ఇంగ్లీష్‌లో తెలుగు తప్పుల్ని ఎత్తి చూపి, సబ్ ఎడిటర్లని రోట్లో పచ్చడి చేసి నంజుకుంటారు.
ఈనాడులో ఏం లేకపోయినా గుడ్డిదో, నడ్డిదో ఒక సిస్టం ఉంది. సాక్షిలో ఎన్ని ఉన్నా సిస్టం లేదు. అది తేడా. ఇంతకు మించి చెబితే బాగుండదు.
ఈనాడుని తిట్టినా , పొగిడినా తెలుగు రాజకీయాల్లో దాని పాత్రని విస్మరించలేం.