iDreamPost
iDreamPost
ఒక బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితం తిరగబడుతుంది. అందుకే టాలీవుడ్ లో ఇలాంటి రిస్కులు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. మాయాబజార్ లాంటి క్లాసిక్ సైతం అవకాశం ఉన్నప్పటికీ వాడుకోకుండా ఒక్క భాగానికే పరిమితమయ్యింది. 90 దశకంలో వర్మ నిర్మాణంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో మనీ సూపర్ డూపర్ హిట్టయ్యాక దాన్ని కంటిన్యూ చేస్తూ మనీ మనీ తీశారు. జస్ట్ యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. కిక్ 2, మన్మధుడు 2, సత్య 2, రక్త చరిత్ర 2,ఆర్య 2 ఇవేవి కనీస స్థాయిలో ఆడలేక ఫ్లాప్ అయ్యాయి.
ఇప్పుడు ట్రెండ్ మారింది. 2 సెంటిమెంట్ చాలా బలంగా కలిసి వస్తోంది. లేటెస్ట్ గా ‘హిట్ 2’ సాధించిన విజయమే దానికి నిదర్శనం. మరీ గొప్పగా చెప్పుకునే సినిమా కాదు కానీ ఈ జానర్ లో వచ్చిన సైకో కిల్లర్స్ కథల్లో ట్రీట్మెంట్ పరంగా కొంత భిన్నంగా అనిపించడంతో ప్రేక్షకులు ఆదరించారు. దీనికన్నా ముందు ‘కార్తికేయ 2’ ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో గొప్ప విజయం సాధించింది. నిఖిల్ లాంటి పరిచయం లేని హీరోని కేవలం కంటెంట్ ఉన్న కారణంగా నార్త్ ఆడియన్స్ ఆదరించారు. ‘కెజిఎఫ్ 2’ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ జపాన్ వెళ్లడానికంటే ముందు దీని పేరు మీద అత్యధిక ఇండియన్ మూవీ వసూళ్ల రికార్డు ఉంది. ‘పుష్ప 2’ కి అప్పుడే విపరీతమైన హైప్ వచ్చేసింది. ఓటిటిలో ‘దృశ్యం 2’ని బాగానే చూశారు
వీటన్నటికి శ్రీకారం చుట్టింది ‘బాహుబలి 2’నే. ఒకప్పుడు ఏదైతే నెగటివ్ గా పని చేసిందో ఇప్పుడు ఆ నెంబరే పాజిటివ్ గా మారడం అనూహ్యం. దీంతో దర్శక నిర్మాతలకు సీక్వెల్స్ మీద ఆసక్తి పెరుగుతోంది. జెంటిల్ మెన్ 2 ఇటీవలే స్టార్ట్ చేశారు. చంద్రముఖి 2ని లారెన్స్ తో ఆల్రెడీ తీస్తున్నారు. ప్రేమదేశం కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు నిర్మాణ బృందంలో ఉన్నాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎంత క్రేజ్ ఉన్నా ఈ నెంబర్ 2ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా పవన్ కళ్యాణ్ అంతటివాడికే సర్దార్ గబ్బర్ సింగ్ రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చూస్తుంటే హాలీవుడ్ స్టైల్ లో మనకూ ఇవి మాములు విషయమయ్యేలా ఉన్నాయి