Idream media
Idream media
లాక్‌డౌన్ ఉల్లంఘన అభియోగాలపై దాఖలైన పిటిషన్లలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం.. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు లాక్‌డౌన్ ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్‌ను కూడా వాటితో కలిపి విచారించాలని నిర్ణయించింది. ఈ రోజు ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న తమ నియోజకవర్గంలోని పేద ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యేలు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, విడదల రజనీ, ఆర్‌కే రోజాలు.. నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆ సమయంలో వారు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రజా ప్రతినిధులే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అని, వారిపై సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించకూడదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ నెల 25వ తేదీన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి 63 రోజుల తర్వాత వచ్చారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా గూమిగూడారు. చంద్రబాబు వారందరికీ మధ్య మధ్యలో అభివాదం చేస్తూ తాడేపల్లి చేరుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది వెంకట రామిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.