iDreamPost
iDreamPost
గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులకు బాగా డిమాండ్ పెరిగిపోయినట్లే ఉంది. కరోనా వైరస్ సంక్షోభంలో వాలంటీర్ల పనితీరుతో ఆ వ్యవస్ధకు మంచిపేరొచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తప్ప దేశంలోని చాలా రాష్ట్రాలు చివరకు బ్రిటన్ ప్రభుత్వం కూడా వాలంటీర్ల సేవల గురించి గొప్పగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది వాలంటీర్లను నియమించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇటువంటి వాలంటీర్ల వ్యవస్ధలో మరిన్ని నియామకాలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. 12796 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తే 80, 707 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనేక వడపోతల తర్వాత ఈ దరఖాస్తుల్లో 54708 దరఖాస్తులను అధికారులు ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. పట్టణాల్లో 7,604 మందిని గ్రామాల్లో 5,192 మందిని నియమించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
కరోనా వైరస్ సమస్య, బాధితులను గుర్తించటం, వైరస్ లక్షణాలున్న వాళ్ళని గుర్తించి ప్రభుత్వానికి తెలియచేయటం, నిత్యావసరాలను అర్హలైన లబ్దిదారులకు చేర్చటం లాంటి అనేక బాధ్యతలతో వాలంటీర్ల వ్యవస్ధ బాగా పాపులరయ్యింది. ఇన్ని బాధ్యతలను చూసుకోవాల్సిన వాలంటీర్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిది. అందుకనే ఇన్ని వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్యూల్లో ఎంపికైన వారికి ఈ నెల 29, 30 తేదీల్లో సమాచారాన్ని ఇస్తుంది ప్రభుత్వం. మే 1వ తేదీన వాళ్ళంతా డ్యూటీల్లో చేరాలి.