Idream media
Idream media
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పధకంలో భాగంగా అమరావతి లో జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమానికి ఏపీ హై కోర్ట్ బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది.
గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోపై రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.
విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరపు న్యాయవాది.. రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇక్కడి భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు కర్నూలుకు కార్యాలయాల తరలింపునపై కూడా ఇటీవల కోర్టు స్టే విధించింది. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై కూడా రాజధాని జేఏసీ కోర్టులు ఆశ్రయించింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ స్టే ఇచ్చింది.